గంపగుత్త అధికారం పార్లమెంటుకు లేదు

గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధిపై పార్లమెంటుకు గంపగుత్త అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Published : 07 Mar 2024 05:03 IST

గనులు, ఖనిజాల అభివృద్ధిపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధిపై పార్లమెంటుకు గంపగుత్త అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రాలకూ వాటిపై నియంత్రణాధికారం, అభివృద్ధి హక్కులుంటాయని బుధవారం తేల్చి చెప్పింది. ‘ఖనిజాలపై పార్లమెంటుకున్న పన్ను విధించే అధికారం అనేది రాష్ట్రాల నియంత్రణాధికారాన్ని తుడిచిపెట్టేస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ‘రాజ్యాంగంలోని లిస్టు 1లో ఉన్న 54వ ఎంట్రీ ఈ విషయంలో పార్లమెంటుకు పూర్తి అధికారం ఇవ్వలేదు. లిస్టు 2లో ఉన్న 23వ ఎంట్రీ.. రాష్ట్రాలకు గనులు, ఖనిజాలపై నియంత్రణ, అభివృద్ధి అధికారం ఉంటుందని స్పష్టం చేస్తోంది’ అని పేర్కొంది. ధర్మాసనంలో జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌ ఉన్నారు. గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1957 (ఎంఎండీఆర్‌) ప్రకారం.. ఖనిజాలపై రాయల్టీని పన్నుగా పేర్కొనవచ్చని, దీనిపై పార్లమెంటుకు గంపగుత్త అధికారముందని మైనింగ్‌ కంపెనీల తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదించారు. దీనిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 1989లో ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ తమిళనాడు ప్రభుత్వం కేసులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. రాయల్టీని పన్నుగా గుర్తించవచ్చని తీర్పు చెప్పింది. అయితే 2004లో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వర్సెస్‌ కేశోరాం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కేసులో తీర్పు చెబుతూ.. 1989 నాటి తీర్పులో అచ్చుతప్పులు దొర్లాయని, రాయల్టీ.. పన్ను కాబోదని స్పష్టం చేసింది. అప్పట్లో ఈ వివాదాన్ని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కోర్టు నివేదించింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని