ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ రాజీనామా

సార్వత్రిక ఎన్నికలు ముంగిట నిలిచిన తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ అనూహ్యంగా శనివారం తన పదవికి రాజీనామా చేశారు.

Published : 10 Mar 2024 03:13 IST

పదవీకాలం మూడేళ్లు ఉండగానే నిర్ణయం
సార్వత్రిక ఎన్నికల ముంగిట సంచలనం
కేంద్ర ఎన్నికల సంఘంలో ఇక మిగిలింది సీఈసీ రాజీవ్‌కుమార్‌ ఒక్కరే

ఈనాడు, దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముంగిట నిలిచిన తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ అనూహ్యంగా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంటనే ఆమోద ముద్ర వేశారు. శనివారం నుంచే రాజీనామా అమల్లోకి వచ్చినట్లు కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆయన రాజీనామాకు కారణాలు తెలియరాలేదు. గోయెల్‌ రాజీనామాతో ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఒక్కరే మిగిలారు. సీనియారిటీపరంగా రెండోస్థానంలో ఉన్న కమిషనర్‌ అనూప్‌చంద్ర పాండే ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేసిన తర్వాత రాజీవ్‌ కుమార్‌, అరుణ్‌ గోయెల్‌ మిగిలారు. ఇప్పుడు గోయెల్‌ రాజీనామాతో ఒక్కరే మిగిలారు. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసే సమయంలో ఎన్నికల సంఘం ఇలా ఏకసభ్య కమిషన్‌గా మారడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గోయెల్‌ 2022 నవంబరు 1న ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం 2027 డిసెంబరు వరకూ ఉంది. ఇంతలో రాజీనామా చేశారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అయిన ఆయన ఇదివరకు కేంద్ర ప్రభుత్వంలో భారీ పరిశ్రమలశాఖ కార్యదర్శిగా పనిచేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత నేతృత్వంలోని ఎంపిక కమిటీ చేసే సిఫార్సుల ఆధారంగా ఇప్పుడు వీరిని నియమించాల్సి ఉంటుంది. కేబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలోని సెర్చ్‌ కమిటీ ఎంపిక చేసిన ప్యానల్‌ను సెలెక్ట్‌ కమిటీకి ప్రతిపాదించిన తర్వాత అందులోంచి అర్హులైన వారిని ఎంపిక చేయాలని కొత్త చట్టం చెబుతోంది. కేంద్రంలో కార్యదర్శి స్థాయిలో పని చేసిన వారినే ఈ పదవులకు ఎంపిక చేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని