Sunita Kejriwal: ‘సునీత.. రబ్రీ దేవిలా మారనున్నారా?’.. వీడియో సందేశంపై భాజపా విమర్శలు!

ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్‌ ఇచ్చిన సందేశాన్ని సునీత వినిపించడంపై విమర్శలు గుప్పించిన భాజపా.. బిహార్‌లో రబ్రీ దేవి మాదిరిగా ఆమె కూడా మారనున్నారనే అనుమానం వ్యక్తం చేసింది.

Updated : 27 Mar 2024 18:05 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన వ్యవహారంలో నిజానిజాలను న్యాయస్థానంలోనే అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) వెల్లడిస్తారని ఆయన సతీమణి సునీత పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్‌ ఇచ్చిన సందేశాన్ని ఆమె వినిపించడంపై భాజపా విమర్శలు గుప్పించింది. కేజ్రీవాల్‌ కూర్చునేచోట నుంచే సునీత వీడియో రికార్డు చేసినట్లు కనిపించిందని.. బిహార్‌లో రబ్రీ దేవి మాదిరిగానే సునీత కూడా మారనున్నారనే అనుమానం వ్యక్తం చేసింది.

‘దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అరెస్టయినప్పుడు రబ్రీ దేవి ఇలానే ప్రకటనలు చేసేవారు. క్రమంగా ఆ కుర్చీని చేజిక్కించుకున్నారు’ అని సునీతను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి అనురాగ్‌ వ్యాఖ్యానించారు. విలువల గురించి మాట్లాడే కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరాహార దీక్షలకు దిగే ఆయన అవినీతి ఊబిలో కూరుకుపోయారని ఆరోపించారు. అయితే, దిల్లీ ముఖ్యమంత్రిగా సునీత తాత్కాలిక బాధ్యతలు స్వీకరించవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర మంత్రి మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కేజ్రీవాల్‌ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు.. భారత్‌ తీవ్ర అభ్యంతరం

మరోవైపు, కేజ్రీవాల్‌ స్థానంలో కూర్చొని.. సునీత వీడియో సందేశం వినిపించడంతో ఆమె త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా 1997లో లాలూప్రసాద్‌ జైలుకు వెళ్లిన తర్వాత బిహార్‌ సీఎంగా రబ్రీ దేవి బాధ్యతలు చేపట్టడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇదిలాఉంటే, లిక్కర్‌ స్కామ్‌లో నిజానిజాలను అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్చి 28న కోర్టులో బయటపెడతారని సునీత వెల్లడించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని