కొనసా...గుతున్న సమావేశాలు!

గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి.

Published : 29 Apr 2024 04:19 IST

ఏడు రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ సెషన్‌ నిడివి ఆరు నెలలకు పైనే..
ప్రొరోగ్‌ చేయకుండా వాయిదాతో నెట్టుకొచ్చారు
2023లో చట్టసభల పోకడలపై మేధోమథన సంస్థ పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ నివేదిక  
కొన్ని రాష్ట్రాల్లో బిల్లులకు గవర్నర్ల ఆమోద ముద్ర పొందటానికి సుప్రీంకోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి

దిల్లీ: గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో చట్టసభలను ప్రొరోగ్‌ చేయకుండా ఆరు నెలలకు పైగా సుదీర్ఘ వాయిదాలతో సిట్టింగ్‌లు నిర్వహించారు. సభను ఒకసారి ప్రొరోగ్‌ చేస్తే మళ్లీ భేటీ కావడానికి గవర్నర్‌ సమ్మతిని పొందాల్సి రావడం కూడా దీని కారణమని తెలుస్తోంది. మేధోమథన సంస్థ పీఆర్‌ఎస్‌ లేజిస్లేటివ్‌ రీసెర్చ్‌ వివిధ రాష్ట్ర అసెంబ్లీల పోకడపై అసక్తికరమైన విశేషాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం...

  • 2023లో రాష్ట్ర అసెంబ్లీలు సగటున 22 రోజుల పాటు భేటీ అయ్యాయి. ప్రతి సిట్టింగ్‌లో సగటు సమావేశ సమయం అయిదు గంటలు.
  • ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ సెషన్‌ను ప్రొరోగ్‌ చేయకుండా...ఆరు నెలలకు పైగానే సమావేశంలో ఉన్నట్లు చూపారు. ఒక సిట్టింగ్‌కు మరో సిట్టింగ్‌కు మధ్య వ్యవధి రోజులు, వారాలు కాకుండా కొన్ని నెలలు ఉండటం గమనార్హం.
  • రాజ్యాంగ నిబంధనల ప్రకారం చట్టసభలు ఆరు నెలల వ్యవధిలో కనీసం ఒకసారైనా సమావేశం కావాలి. అయితే, 62శాతం సిట్టింగ్‌లు బడ్జెట్‌ సెషన్‌ అప్పుడే జరిగాయి.
  • దిల్లీ అసెంబ్లీకి సంబంధించి ఒక సెషన్‌ 2023 మార్చి నుంచి అదే ఏడాది డిసెంబరు వరకు     కొనసా...గింది. ఈ వ్యవధిలో జరిగిన సిట్టింగ్‌లు      14 మాత్రమే.
  • పంజాబ్‌ అసెంబ్లీ 2023 మార్చి నుంచి అక్టోబరు వరకు 10 సార్లు మాత్రమే బేటీ అయ్యింది.
  • బడ్జెట్‌ సెషన్‌ కోసం గవర్నర్‌ శాసనసభను సమావేశపరచడం లేదని ఆరోపిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర మంత్రిమండలి సలహాలను గవర్నర్‌ పాటించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.
  • రాజస్థాన్‌ అసెంబ్లీ సెషన్‌ కూడా 2023 జనవరి నుంచి ఆగస్టు వరకు కొనసా...గింది. 2021, 2022లలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఒకేఒక్క సెషన్‌ను(జనవరి-డిసెంబరు) నిర్వహించింది.
  • పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ సెషన్‌ 2023 జులైలో ప్రారంభమై... 2024 మార్చి వరకు ప్రొరోగ్‌ కాలేదు. బడ్జెట్‌ ఆమోదం కోసం ఫిబ్రవరిలో సమావేశమైన శాసనసభ... సంప్రదాయానికి భిన్నంగా గవర్నర్‌ ప్రసంగంలేకుండానే మొదలైంది.
  • సిక్కిం, తమిళనాడు, తెలంగాణలలో ఒక్కో సెషన్‌ ఏడాదికిపైగానే కొనసాగింది.
  • సిక్కింలో 2022 మార్చిలో మొదలైన సెషన్‌ 2023 ఏప్రిల్‌లో ప్రొరోగ్‌ అయ్యింది.
  • తెలంగాణలో ఒక సెషన్‌ 2021 సెప్టెంబరు నుంచి 2023 ఆగస్టు వరకు కొనసాగింది.

చర్చించకుండానే బిల్లుల ఆమోదం

  • 2023లో 44శాతం బిల్లులు అసెంబ్లీల్లో ప్రవేశపెట్టిన రోజే దాదాపు చర్చించకుండానే ఆమోదం పొందాయి. గుజరాత్‌, ఝార్ఖండ్‌, మిజోరం, పుదుచ్చేరి, పంజాబ్‌ అసెంబ్లీల్లో ఈ తరహా పరిస్థితి ఎక్కువగా కనిపించింది.
  • కేరళ, మేఘాలయ అసెంబ్లీల్లో మాత్రం 90 శాతం బిల్లులపై సగటున 5 రోజులకు పైగా చర్చించారు.
  • శాసనసభలు ఆమోదించిన 59 శాతం బిల్లులకు మాత్రమే గవర్నర్ల సమ్మతి నెలలోపే లభించింది. అయితే, బిహార్‌, గుజరాత్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా ఏడు రాష్ట్రాల్లో 100శాతం బిల్లులు నెల లోపే గవర్నర్ల ఆమోద ముద్ర పొందాయి.
  • రెండు నెలలకు పైగా గవర్నర్ల ఆమోదం లభించని బిల్లులు అస్సాంలో 80శాతం, నాగాలాండ్‌-57%, ఝార్ఖండ్‌-50%, పశ్చిమబెంగాల్లో 50శాతంగా ఉన్నాయి.
  • అసెంబ్లీ సమ్మతించిన తర్వాత బిల్లు గవర్నర్‌ ఆమోదం పొందటానికి పట్టిన సగటు సమయం పశ్చిమబెంగాల్లో 92 రోజులు, అస్సాంలో 73 రోజులు, ఝార్ఖండ్‌లో 72 రోజులు, కేరళలో 67 రోజులు, హిమాచల్‌ప్రదేశ్‌లో 55 రోజులు.
  • ఎనిమిది బిల్లుల ఆమోదానికి గవర్నర్‌ జాప్యం చేస్తుండడంతో కేరళ ప్రభుత్వం 2023 నవంబరులో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఇదే విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లాయి.
  • ఏడాదిలో అత్యధిక రోజులు సమావేశమైన శాసనసభగా..... మహారాష్ట్ర అసెంబ్లీ(41) ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్‌(40), కర్ణాటక (39) ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, తెలంగాణ అసెంబ్లీలు 20 రోజుల కన్నా తక్కువగానే భేటీ అయ్యాయి.
  • అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలు 10 కన్నా తక్కువ రోజులే సమావేశమయ్యాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని