కాపాడుకుందాం.. పసివారి ప్రాణం

Eenadu icon
By National News Desk Published : 29 Oct 2025 06:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పోషకాహార లోపమే వ్యాధులకు ప్రధాన కారణం
‘చిల్డ్రన్‌ ఇన్‌ ఇండియా 2025’ నివేదికలో వెల్లడి
ఈనాడు - చెన్నై

పసిపిల్లల ఆరోగ్యాన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటి ఆరేళ్లలోపు వారి శారీరక, మానసిక, సామాజిక  ఎదుగుదలపై దృష్టిపెట్టాలి. కానీ, పోషకాహార లోపం వీరి పాలిట శాపంగా మారుతోంది. పిల్లల సమగ్ర ఎదుగుదలకు అవరోధంగా ఉన్న సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను  వివరిస్తూ కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ తాజాగా ‘చిల్డ్రన్‌ ఇన్‌ ఇండియా 2025’ పేరుతో ఓ నివేదిక ఇచ్చింది.

కన్నీటి గుర్తులు

పోషకాహార లోపంతో పిల్లలకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ తగినంతగా అందట్లేదు. 35.5% పిల్లల్లో పెరుగుదల లోపాలున్నాయి. ఈ సమస్య పట్టణ ప్రాంతాల్లో 30.1%, గ్రామీణ ప్రాంతాల్లో 37.3% మందిలో ఉంటోంది. మేఘాలయలో అత్యధికంగా 46.5% పిల్లలు ఈ లోపంతో బాధపడుతున్నారు.

  • ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు దేశవ్యాప్తంగా 19.3% ఉన్నారు. ఈ తీవ్రత మహారాష్ట్రలో(25.6%) ఎక్కువ.
  • 10-14 ఏళ్లలోపు పిల్లల్లో విటమిన్‌ డి లోపం 23.9%, జింక్‌ లోపం 31.7% మందిలో ఉంది. 10-19 ఏళ్ల పిల్లల్లో మధుమేహానికి ముందుదశలో (ప్రీ డయాబెటిక్‌) 10.4% ఉండగా, ఇప్పటికే మధుమేహం ఉన్నవారు 0.6% మంది. రక్తంలో అధిక కొవ్వు 3.7% మందికి, రక్తపోటు 4.9% మందికి ఉంటోంది.

తల్లిపాలే పరమౌషధం

పిల్లల సమగ్ర ఎదుగుదలకు తల్లిపాలే పరమౌషధమని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. పుట్టిన తొలి గంటలోనే చనుబాలు తాగించడం, 6 నెలల వరకు కేవలం పాలనే పట్టించడం, తర్వాత రెండేళ్ల వయసొచ్చేవరకు తగిన ఆహారం తినిపిస్తే పిల్లల్లో శక్తి, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో పాటు రోగనిరోధకశక్తి పెరుగుతుందని నివేదిక చెప్పింది. తల్లిపాలే బిడ్డకు తొలి వ్యాక్సిన్‌గా పనిచేస్తాయని పేర్కొంది.

అయోడైజ్డ్‌ ఉప్పుతో..

అయోడైజ్డ్‌ ఉప్పు వాడితే పిల్లలకు సూక్ష్మపోషకాలు చేరడంతో పాటు.. థైరాయిడ్‌ సమస్య తలెత్తదు. ప్రత్యేకించి అయోడిన్‌ లోపాలున్న పిల్లలు అత్యధికంగా దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే (82.5%) ఉన్నట్లు నివేదిక తెలిపింది.

సూక్ష్మపోషకాలు అవసరం

పిల్లల దేహానికి విటమిన్లు, మినరల్స్‌ అవసరం చాలా తక్కువ. అవి కూడా అందక అనారోగ్య సమస్యలు, మరణాలు సంభవిస్తున్నాయి. తీసుకునే ఆహారంలో విటమిన్‌ ఏ, ఐరన్‌ ఉండేలా చూసుకోవాలి. ఇవి దృష్టిలోపం, రక్తహీనత నుంచి కాపాడతాయి. 

టీకాలతో రక్ష

వ్యాధుల నుంచి పిల్లల్ని సంరక్షించేందుకు టీకాలు వేయించడం చాలా అవసరం. కనీసంగా ఒక డోస్‌ బీసీజీ, మూడు డోస్‌ల డీపీటీ, 3 డోస్‌ల పోలియో, ఒక డోస్‌ మీజిల్స్‌ వ్యాక్సిన్లు తప్పనిసరని కేంద్రం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు