FDC: నాలుగేళ్లలోపు పిల్లల్లో జలుబు నివారణకు ఎఫ్‌డీసీ ఔషధాలు వాడొద్దు: కేంద్రం

నాలుగేళ్లలోపు పిల్లల్లో జలుబు నివారణకు ఎఫ్‌డీసీ ఔషధాలు వినియోగాన్ని కేంద్రం నిషేధించింది. ఈ మేరకు డీజీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.

Updated : 21 Dec 2023 17:19 IST

దిల్లీ: నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో జలుబు నివారణ కోసం ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (FDC)తో తయారైన ఔషధాల వినియోగాన్ని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) నిషేధించింది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ మండలి (DGCI) ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది వినియోగదారులకు తెలిసేలా లేబుళ్లపై సమాచారాన్ని ముద్రించాలని ఔషధ తయారీ సంస్థలకు తెలిపింది. ఈ మేరకు డీజీసీఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రఘువంశీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. 

ప్రొఫెసర్‌ కోకటే కమిటీ ఎఫ్‌డీసీని హేతుబద్ధమైన ఔషధంగా పేర్కొందని సంస్థ తెలిపింది. కమిటీ సిఫార్సుల మేరకు ఎఫ్‌డీసీ ఔషధాల తయారీని కొనసాగించేందుకు 18 నెలల విధానపరమైన నిర్ణయంలో భాగంగా 2017 జులై 17 నుంచి అనుమతించినట్లు రాజీవ్‌ తెలిపారు. అయితే, చిన్న పిల్లలకు ఎఫ్‌డీసీ వినియోగం ఆమోద యోగ్యం కాదన్న ఆందోళనల నేపథ్యంలో, వీటిపై శ్వాసకోశ సంబంధ వ్యాధుల నిపుణుల కమిటీతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో జలుబు నివారణ కోసం ఎఫ్‌డీసీ ఔషధాల వినియోగంపై నిషేధం విధించాలని నిర్ణయించినట్లు రాజీవ్‌ తెలిపారు.

ఎఫ్‌డీసీ అంటే..

రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను కలిపి ఒకే ఔషధంగా ఆవిష్కరిస్తే, దానిని ఎఫ్‌డీసీ ఔషధంగా పరిగణిస్తారు. ఈ మిశ్రమ ఔషధాల సహేతుకత నిర్ధారణ కాలేదని, పైగా వీటివల్ల ప్రజలకు ప్రమాదం తలెత్తవచ్చని, 14 రకాల ఎఫ్‌డీసీలపై ఈ ఏడాది జూన్‌లో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిపై ఏర్పాటైన నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు 2016లో ఒకసారి ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం 322 ఎఫ్‌డీసీ ఔషధాలను నిషేధించింది. తాజాగా జలుబు నివారణ కోసం నాలుగేళ్ల పిల్లల్లో ఎఫ్‌డీసీల వినియోగాన్ని నిషేధిస్తూ సీడీఎస్‌సీవో నిర్ణయం తీసుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని