Donkey Farm: గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్‌ కుర్రాడి సక్సెస్‌ స్టోరీ!

Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్‌ ప్రారంభించిన గుజరాత్‌ కుర్రాడు ధీరేణ్‌ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..!

Updated : 21 Apr 2024 15:08 IST

అహ్మదాబాద్‌: ‘బాగా చదువుకోకపోతే గాడిదలు కాయాల్సి వస్తుంది’ అంటూ పెద్దవాళ్లు మందలిస్తుంటారు. అలాంటివారు గుజరాత్‌కు చెందిన ధీరేణ్‌ సోలంకీ స్టోరీ వింటే మాత్రం అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే గాడిదల పెంపకంతో అతడు నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నాడు. దేశవ్యాప్తంగానూ గాడిదల పెంపకానికి క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది.

ఉపాధి కోసం అన్వేషిస్తుండగా..

ధీరేణ్‌ చాలా కాలం పాటు ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమయ్యాడు. ఫలితం లేక కొన్ని ప్రైవేట్‌ సంస్థల్లో పని చేశాడు. ఆర్థికంగా పెద్దగా సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో కొత్త ఉపాధి మార్గాలు అన్వేషించాడు. దక్షిణ భారత్‌లో గాడిదల పెంపకానికి క్రమంగా ఆదరణ పెరుగుతోందని తెలుసుకున్నాడు. కొంత మందిని కలిసి సమాచారం సేకరించాడు.

20 గాడిదలతో ప్రారంభం..

ఎనిమిది నెలల క్రితం 20 గాడిదలతో సొంత ఊర్లోనే ఫామ్‌ను ప్రారంభించాడు. రూ.22 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు అవి 42 గాడిదలయ్యాయి. వాటి నుంచి వచ్చే పాలను దక్షిణ భారత్‌లోని కస్టమర్లకు సరఫరా చేస్తున్నాడు. నెలకు రూ.2-3 లక్షలు సంపాదిస్తున్నానని స్వయంగా ధీరేణ్‌ చెప్పాడు. ‘‘తొలినాళ్లలో కాస్త కష్టంగానే అనిపించింది. గుజరాత్‌లో గాడిద పాలకు పెద్దగా గిరాకీ లేదు. దీంతో తొలి ఐదు నెలలు ఆదాయమేమీ రాలేదు. క్రమంగా దక్షిణ భారత్‌లోని కస్టమర్లను సంప్రదించా. అక్కడ డిమాండ్‌ బాగా ఉంది. ఇప్పుడు కర్ణాటక, కేరళకు ఈ పాలను సరఫరా చేస్తున్నాను. సౌందర్య ఉత్పత్తుల తయారీ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి’’ అని సోలంకీ వివరించాడు.

లీటర్‌ రూ.5,000-7,000

గాడిద పాలు ఒక లీటర్‌ ధర రూ.5,000-7,000 వరకు ఉన్నట్లు సోలంకీ తెలిపాడు. ‘‘తాజాగా ఉండడం కోసం పాలను ఫ్రీజర్లలో నిల్వ చేస్తున్నాం. వీటిని పొడిగానూ మార్చి విక్రయిస్తున్నాం. ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్లు తీసుకొని సరఫరా చేస్తున్నాం. ఇప్పటి వరకు రూ..38 లక్షల వరకు ఖర్చయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం తీసుకోలేదు. కానీ, సర్కార్‌ ఈ రంగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’’ అని సూచించాడు.

ఇవీ లాభాలు..

ఇన్ఫెక్షన్లూ, కోరింత దగ్గు, వైరల్‌ జ్వరాలు, ఆస్తమాకీ గాడిదపాలను ఔషధంగా వాడుతుంటారు. ఈ పాలల్లో ఎ, బి, బి1, బి12, సి, డి, ఇ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయని వైద్యులు చెప్పారు. కొవ్వు తక్కువ. నిద్రలేమి, ఎసిడిటీలతోపాటు ఎగ్జిమా, సిఫిలిస్‌, స్కేబిస్‌, దురద, తామర... వంటి ఇన్ఫెక్షన్లకి గాడిద పాలు మంచి ఔషధమని చెబుతారు. ఆ పాలతో ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌, షాంపూ, లిప్‌బామ్‌, బాడీవాష్‌... వంటి కాస్మెటిక్స్‌ తయారుచేస్తుంటారు. 

ఏ పనీ చేయనివాళ్లను ‘ఏం చేస్తున్నావ్‌... గాడిదల్ని కాస్తున్నావా...’ అని ఆ మూగజీవాలను చులకన చేయకండి ఇక.. అవే ఇప్పుడు రూ.లక్షలు సంపాదించి పెడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని