Heavy Rains: గుజరాత్‌లో భారీ వర్షాలు.. వరదనీటిలో తేలియాడిన కార్లు..!

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఈ వానల కారణంగా గుజరాత్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

Updated : 19 Jul 2023 16:37 IST

గాంధీనగర్: భారీ వర్షాలు(Heavy Rains) గుజరాత్(Gujarat)ను అతలాకుతలం చేస్తున్నాయి. మరికొన్ని రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనావేసింది. ఈ క్రమంలో వానల కారణంగా రాజ్‌కోట్‌, సూరత్‌, గిర్‌ సోమనాథ్‌ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. మంగళవారం పలుచోట్ల 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దాంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్(SEOC) గణాంకాల ప్రకారం.. గిర్ సోమనాథ్ జిల్లాలోని సూత్రపాడ తాలూకాలో అత్యధిక వర్షపాతం(345mm) నమోదైంది. ప్రస్తుతం జలదిగ్బంధానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్లు, ఇతర వాహనాలు నీటిలో తేలియాడుతున్న వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వరదల కారణంగా దుకాణాలు మూసివేశారు. గిర్‌ సోమనాథ్‌లోని ఓ ప్రాంతంలో మొసలి జనావాసంలోకి ప్రవేశించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో 43 రిజర్వాయర్లకు హైఅలర్ట్‌ ప్రకటించినట్లు గుజరాత్(Gujarat) ప్రభుత్వం వెల్లడించింది. మరో 19 రిజర్వాయర్లకు హెచ్చరికలు జారీ చేసింది.

ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్(NDRF), స్టేట్‌ డిజాస్టర్ రెస్పాన్స్‌ ఫోర్సెస్‌ (SDRF)ను అధికారులు సిద్ధంగా ఉంచారు. మునిగిన పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోంది. ఈ కార్యకలాపాలను తెలుగు వ్యక్తి, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) కమాండెంట్‌ వి.వి.ఎన్‌.ప్రసన్నకుమార్‌ పర్యవేక్షిస్తున్నారు.

మళ్లీ డేంజర్‌ మార్క్‌ దాటిన యమునా నది

గత నెల గుజరాత్‌(Gujarat)ను బిపోర్‌జాయ్ తుపాను(Cyclone Biparjoy) వణికించిన సంగతి తెలిసిందే. దాని ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతంలో భీకర గాలులు, కుండపోతగా వర్షాలు కురిశాయి. ఆ సమయంలో ఆలయాలు, పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. భారీ సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని