Manohar Lal Khattar: బుల్లెట్ నడిపిన సీఎం ఖట్టర్‌.. వీడియో వైరల్‌

హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ సాధారణ పౌరుడిలా హెల్మెట్‌ ధరించి రోడ్డుపై బుల్లెట్‌ నడుపుతూ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Published : 26 Sep 2023 14:15 IST

కర్నాల్‌: రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనగానే.. ఆయన చుట్టూ భారీ భద్రత ఉంటుంది. ఇక ఆయన బయటికి వస్తున్నారంటే.. అధికారుల,  భద్రతా సిబ్బంది, అనుచరుల హడావుడి గురించి చెప్పాల్సిన అవసరంలేదు. ఇందుకు భిన్నంగా.. హరియాణా (Haryana) సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ (Manohar Lal Khattar) సాధారణ పౌరుడిలా హెల్మెట్‌ ధరించి రోడ్డుపై బుల్లెట్‌ నడుపుతూ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఖట్టర్‌ ఒక్కరే బుల్లెట్ నడుపుతూ వెళుతుంటే.. ఆయన వెనుక బైక్‌లపై అధికారులు, భద్రతా సిబ్బంది అనుసరించారు. 

హరియాణాలో కార్‌ ఫ్రీ డే (Car Free Day) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సీఎం ఖట్టర్‌ బుల్లెట్‌ నడిపినట్లు తెలిపారు. ‘‘కార్‌ ఫ్రీ డే అయినా, డ్రగ్స్‌ ఫ్రీ హరియాణాగా మార్చాలనే సంకల్పం అయినా.. ప్రజల సహకారం లేకుండా ఏది సాధ్యంకాదు. రోడ్లపై ట్రాఫిక్‌ను తగ్గించడంలో భాగంగా నిర్వహించిన ‘కార్‌ ఫ్రీ డే’లో భాగంగా నేను స్వయంగా బైక్‌పై కర్నాల్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. రాష్ట్ర ప్రజలు కూడా ట్రాఫిక్‌ను తగ్గించేందుకు తమ వంతు భాగస్వామ్యంగా ఒక్కరోజు కార్లను ఉపయోగించరని ఆశిస్తున్నా’’ అని ఖట్టర్‌ ట్వీట్‌ చేశారు. గతంలో కూడా ఓ కార్యక్రమంలో భాగంగా మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ బుల్లెట్‌ నడిపిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని