Haryana: హరియాణాలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. 13న బలపరీక్ష!

తమకు 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, బలపరీక్ష నిర్వహణకు బుధవారం అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని హరియాణా నూతన సీఎం నాయబ్‌ సింగ్‌.. గవర్నర్‌ను కోరారు.

Published : 12 Mar 2024 22:27 IST

చండీగఢ్‌: హరియాణా (Haryana) నూతన ముఖ్యమంత్రిగా నాయబ్‌సింగ్‌ సైనీ (Nayab Singh Saini) మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆయనతో ఈ ప్రక్రియ పూర్తి చేయించారు. నలుగురు భాజపా, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణం చేశారు.

తమ ప్రభుత్వానికి 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నూతన సీఎం నాయబ్‌ సింగ్‌ వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ సమర్పించామని, మెజారిటీ నిరూపించుకునేందుకుగానూ బుధవారం అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హరియాణాలో భాజపాకు 41 సీట్లు ఉన్నాయి. హరియాణా లోక్‌హిత్‌ పార్టీ ఎమ్మెల్యే గోపాల్‌, ఆరుగురు స్వతంత్రుల మద్దతు ఉంది. కొంతమంది జేజేపీ ఎమ్మెల్యేలూ కొత్త ప్రభుత్వం వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హరియాణా కొత్త సీఎంగా నాయబ్‌ సైనీ

అంతకుముందు సీఎం పదవికి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షం జేజేపీతో విభేదాలు తలెత్తడం వల్లే ఆయన అధికార పీఠం నుంచి దిగిపోయినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కర్నాల్‌ ఎంపీ స్థానం నుంచి ఖట్టర్‌ పోటీ చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని