Haryana: హరియాణా కొత్త సీఎంగా నాయబ్‌ సైనీ..

Haryana: హరియాణా నూతన ముఖ్యమంత్రిగా భాజపా నేత నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Updated : 12 Mar 2024 15:08 IST

చండీగఢ్‌: హరియాణా (Haryana)లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భాజపా ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్‌ సింగ్‌ సైనీ (Nayab Singh Saini) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనను నూతన సీఎంగా ఎన్నుకున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలు వెల్లడించారు. ఈ సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సైనీ కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు.

ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలోనే పలువురు నేతల పేర్లు తెరపైకి రాగా.. చివరకు నాయబ్‌ సైనీ (Nayab Singh Saini) వైపు భాజపా అధిష్ఠానం మొగ్గుచూపింది. ఈయన ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడు.

ఓబీసీ వర్గానికి చెందిన సైనీ 1996లో భాజపాలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పార్టీలో పలు పదవులు చేపట్టారు. 2014లో నారాయణ్‌గఢ్‌ నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో రాష్ట్ర మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఏకంగా 3.83లక్షల మెజార్టీతో విజయం సాధించారు. గతేడాది అక్టోబరులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. హరియాణా ఓబీసీల్లో సైనీల జనాభా దాదాపు 8 శాతం. కురుక్షేత్ర, హిస్సార్‌, అంబాలా, రేవాడీ జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఈ క్రమంలోనే వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయబ్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది.

హరియాణా సీఎం ఖట్టర్‌ రాజీనామా

లోక్‌సభ ఎన్నికల్లో ఖట్టర్‌..

అంతకుముందు సీఎం పదవికి ఖట్టర్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్ర పక్షం జేజేపీతో విభేదాలు తలెత్తడం వల్లే ఆయన అధికార పీఠం నుంచి దిగిపోయినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కర్నాల్‌ ఎంపీ స్థానం నుంచి ఖట్టర్‌ పోటీ చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని