Akhilesh on BJP: 400 సీట్లిస్తే.. ఓటు హక్కునూ లాగేసుకుంటారు: అఖిలేశ్‌ యాదవ్‌

భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ఓటు హక్కునూ లాగేసుకుంటారని ఆరోపించారు.

Published : 15 Apr 2024 20:08 IST

లఖ్‌నవూ: దేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకే భారతీయ జనతా పార్టీ (BJP) 400 సీట్ల నినాదం అందుకుందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌ (Akhilesh yadav) అన్నారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని ఆ పార్టీ రూ.కోట్లు దోచుకునేందుకు వినియోగించుకుందని ఆరోపించారు. ముజఫర్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.

‘‘రాజ్యాంగాన్ని మార్చేందుకు 400 సీట్లు కావాలంటూ వారు నినాదం ఇస్తున్నారు. అదే జరిగితే రాజ్యాంగాన్నే కాదు రిజర్వేషన్లూ రద్దు చేస్తారు. ఓటు హక్కునూ లాగేసుకుంటారు’’ అని అఖిలేశ్‌ అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీని బూచిగా చూపించి రూ.400 కోట్లు, రూ.600 కోట్లు, రూ.1000 కోట్లు చొప్పున సొమ్మును కార్పొరేట్ల నుంచి భాజపా దోచుకుందని విమర్శించారు. దేశంలో గత పదేళ్లలో లక్ష మంది రైతులు చనిపోయారని, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఏమాత్రం సాయం చేయలేదన్నారు.

‘రాజ్యాంగం మార్పు’పై వ్యాఖ్యలు.. వివాదంలో టీవీ రాముడు

పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.15 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన ఈ ప్రభుత్వం.. రూ.2 లక్షల కోట్ల రైతు రుణాలను మాత్రం మాఫీ చేయడానికి ముందుకురాలేదని అఖిలేశ్‌ గుర్తుచేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఉద్యోగాలు దొరక్క యువతకు వివాహాలు జరగడం లేదన్నారు. 2014లో మోదీ ఇచ్చిన హామీల అమలుకే దిక్కులేదని.. ఇప్పుడు ‘గ్యారెంటీ’ అంటూ మరోసారి మోసం చేసేందుకు ముందుకొచ్చారని విమర్శించారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటేయాలని అభ్యర్థించారు. ముజఫర్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్‌ 19న తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని