Project Cheetah: మరణాలు ఆగాలంటే.. ఆ చీతాలు రావాల్సిందే!

విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో.. ఆఫ్రికా వైద్యనిపుణులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కీలక అంశాలు వెల్లడించారు.

Published : 04 Aug 2023 02:02 IST

దిల్లీ: ‘ ప్రాజెక్ట్‌ చీతా’లో (Project Cheetah) భాగంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాల మరణాలు కలవరపరుస్తున్నాయి. దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి 20 చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కుకు తీసుకురాగా..ఇప్పటి వరకు 6 చీతాలు ప్రాణాలు కోల్పోయాయి. చీతాల మరణాలకు చెక్‌ పెట్టేందుకు నిపుణులు పలు సూచనలు చేశారు. ఈ మేరకు ప్రాజెక్ట్‌ చీతాలో భాగమైన ఆఫ్రికా నిపుణులు భారత ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కీలక అంశాలు వెల్లడించారు.

యుక్త వయస్సు కీలకం

నడి వయస్సు చీతాలకంటే యుక్తవయస్సులో ఉన్నవాటిని తీసుకొస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నారు. మరణాల రేటు కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అటవీ ప్రాంతంలో తిరుగుతున్న వాహనాలు, మనుషుల సంచారానికి అలవాటు పడిన వాటిని ఎంపిక చేసుకోవడం మంచిదని తెలిపారు. దీంతో అవి భీతిల్లకుండా ఉంటాయని, అంతేకాకుండా వాటి పర్యవేక్షణ, వైద్యం కూడా సులువవుతుందని పేర్కొన్నారు. సాధారణంగా యుక్త వయస్సులో ఉన్న చీతాలకు కోపం తక్కువ. వాటిలో అవి పోట్లాడుకోవు. వ్యాధి నిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా త్వరగా కోలుకునేందుకు అవకాశమెక్కువ. 

నడివయస్సు దాటిన చీతాలకు వ్యాధి నిరోధక శక్తి క్రమంగా సన్నగిల్లుతూ ఉంటుంది. అంతేకాకుండా కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు వాతావరణంలో కలిగే మార్పులు అవి తట్టుకోవడం కాస్త కష్టం. దీంతో అవి మృత్యువాత పడుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. భారీ మొత్తంలో వెచ్చించి..తీరా వయస్సు మళ్లిన చీతాలను దిగుమతి చేసుకుంటే.. వాటి జీవితకాలం తక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని నిపుణులు నివేదికలో పేర్కొన్నారు. చీతాల దిగువతి వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని యుక్తవయస్సులో ఉన్న చీతాలకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

మరో 10 చీతాలు రెడీ

భారత్‌లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దక్షిణాఫ్రికా వైద్యనిపుణులు మరో 10 చీతాలను సిద్ధం చేశారు. భారత్‌ అధికారుల సూచన మేరకు 19 నెలల నుంచి 3 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వాటిని ఎంపిక చేశారు. వీటిని 2024 ప్రారంభంలో వీటిని ఇండియాకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు భారత్‌లో చీతాలు మృతి చెందడంపై ఆందోళన అక్కర్లేదని ఆఫ్రికా నిపుణుల బృందం స్పష్టం చేసింది. రేడియో కాలర్‌ వల్లే చీతాలు మృతి చెందుతున్నాయంటూ మీడియాలో వార్తలు రావడం దురదృష్టకరమని పేర్కొంది. చీతాలు మృతి ముందుగా ఊహించిందేనని.. మరణాలు ఇంకాస్త పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని స్పష్టం చేసింది. 

‘ఉల్లి ఘాటు’తో విమానం వెనక్కి..! అసలేం జరిగిందంటే..!

చీతాల సంఖ్యను అభివృద్ధి చేసేందుకు దక్షిణాఫ్రికా చేసిన 10 ప్రయత్నాల్లో 9 విఫలమయ్యాయని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఆ వైఫల్యాలే.. కొత్తమార్గాలను అన్వేషించేందుకు ఉపకరించాయని అంటున్నారు.‘‘ దక్షిణాఫ్రికాలో చీతాల సంఖ్య పెరిగేందుకు 26 ఏళ్లు పట్టింది. మొత్తం 10 సార్లు ప్రయత్నించాం. ఈ ప్రయత్నాల్లో 279 చీతాలు ప్రాణాలు కోల్పోయాయి. అయితే, భారత్‌లో అలాంటి పరిస్థితులు తలెత్తుతాయని అనుకోవడం లేదు. భారత్‌లో ఇలాంటి నష్టాలు ఎదురైనా భయపడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా బాలారిష్టాలు తప్పవు.’’అని దక్షిణాఫ్రికా వన్యప్రాణుల నిపుణుడు విన్సెంట్ వాన్ డెర్ మెర్వే పేర్కొన్నారు.

సంతాన సామర్థ్యం

మరోవైపు విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాల సంతాన సామర్థ్యంపై నిపుణులు కొన్ని అంశాలను లేవనెత్తారు. గతంలో తీసుకొచ్చిన 7 ఆడ చీతాల్లో కేవలం ఒక్కటి మాత్రమే పిల్లలకు జన్మనిచ్చి ‘సూపర్‌ మామ్‌’గా పేరొందిందని చెప్పిన నిపుణులు.. ఆ ఆడ చీతా జన్యువులపై పరిశోధన చేసి ఆ తరహా చీతాలను దిగుమతి చేసుకుంటే ప్రయోజనం ఉంటుందని కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు