Air India Express: ‘ఉల్లి ఘాటు’తో విమానం వెనక్కి..! అసలేం జరిగిందంటే..!

ఓ బాక్సులో ఉన్న ఉల్లి ఘాటు వాసన కారణంగా విమానాన్ని (Air India Express) వెనక్కి మళ్లించాల్సిన ఘటన కొచ్చిలో చోటుచేసుకుంది.

Updated : 03 Aug 2023 17:24 IST

కొచ్చి: సాంకేతిక సమస్యలు, అత్యవసర పరిస్థితులు తెలెత్తినప్పుడు విమానాలు దారి మళ్లించడం లేదా దగ్గర్లోని ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌ (Emergency Landing) చేస్తుంటారు. కానీ, ఈసారి మాత్రం విమానంలో వచ్చిన ‘ఘాటు వాసన’.. అత్యవసరంగా వెనక్కి మళ్లించడానికి కారణమైంది. అందుకు ఓ బాక్సులో ఉన్న ఉల్లి/కూరగాయలే కారణం కావడం గమనార్హం. తాజా ఘటన కొచ్చి నుంచి షార్జాకు బయలుదేరిన విమానంలో (Air India Express) చోటుచేసుకుంది.

కొచ్చి నుంచి షార్జాకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (IX 411) విమానం.. 175 మంది ప్రయాణికులతో ఆగస్టు 2 రాత్రి బయలుదేరింది. పైకి ఎగిరిన కొద్ది సేపటికే ఏదో ఘాటు/మండుతున్న వాసన వస్తోందని ఓ ప్రయాణికుడు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. తోటి ప్రయాణికులు కూడా అదే ఫిర్యాదుచేశారు.దీంతో విమానంలో గందరగోళం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పైలట్‌.. ముందు జాగ్రత్తగా విమానాన్ని వెనక్కి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. ఆ నిర్ణయంతో ప్రయాణికుల్లో మరింత ఆందోళన, ఉత్కంఠ పెరిగాయి. కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో (CIAL) సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఇంజినీరింగ్‌ బృందాలు వచ్చి విమానం మొత్తం పరిశీలించాయి. పొగ లేదా ఏదైనా సాంకేతిక సమస్య ఉందని చెప్పడానికి ఏవిధమైన ఆధారాలు లభించలేదు. చివరకు విమానంలోని సరకు రవాణా విభాగంలోని ఉల్లి లేదా కూరగాయల బాక్సు ఆ ఘాటు వాసనకు కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు.

‘కోటా’లో ఆగని ఆత్మహత్యలు.. 8 నెలల్లో 17 మంది..!

ఈ ఘటనకు సంబంధించి అదే విమానంలో షార్జా వెళ్తున్న  కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మాథ్యూ కులల్‌నాదన్‌ మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో విమానంలో గందరగోళం నెలకొంది. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ఊపిరి పీల్చుకున్నాం’ అని వివరించారు. దీనిపై సదరు విమానయాన సంస్థ కూడా స్పందిస్తూ.. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. ‘కార్గో’లో పెట్టిన ఉల్లి/కూరగాయల నుంచే ఆ ఘాటు వాసన వచ్చి ఉండవచ్చని ఎయిర్‌లైన్స్‌ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాల్లో కూరగాయలు, పండ్లు, పూలను కూడా భారీ స్థాయిలో తరలిస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని