PM Modi: పేదరికంపై పోరాటానికి సాంకేతిక అస్త్రం: మోదీ

ఎఫ్‌డీఐలో సంస్కరణలు, డ్రోన్‌ నియమనిబంధనల్లో సడలింపులు, సెమీకండక్టర్‌ తయారీ దిశగా అడుగులు భారత దేశ పురోగతి నిదర్శనం అని ప్రధాని మోదీ అన్నారు. పేదరికంపై పోరుకు సాంకేతికతను అస్త్రంగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 

Published : 16 Nov 2022 23:09 IST

బెంగళూరు: పేదరికంపై పోరాటానికి భారత్‌ సాంకేతికతను అస్త్రంగా ఉపయోగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బెంగళూరులో జరుగుతున్న 25వ బెంగళూరు టెక్‌ సమ్మిట్‌ 2022 సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు. భారత్‌ సాంకేతికతలో ఎంతో పురోగతి సాధించిందని, ఇప్పటికే దేశంలోని యువత తమ సాంకేతికత సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. 

పేదరికంపై పోరులో భాగంగా స్వమిత్వ స్కీమ్‌ ద్వారా భూ సర్వేకు డ్రోన్ల వినియోగాన్ని ప్రధాని ప్రస్తావించారు. ప్రతి ఒక్కరికి జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌ ఫోన్‌ (జేఏఎం) ద్వారా అర్హులకు లబ్ధిచేకూరడంతోపాటు, వారి ఖాతాల్లోకే నేరుగా నగదు బదిలీ జరుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు.  కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జెమ్‌ ఈ-కామర్స్‌ సంస్థ దేశంలోని చిన్న వ్యాపారులు నేరుగా వినియోగదారులకు చేరువయ్యేందుకు సాయపడుతోందని తెలిపారు. 

‘‘ప్రస్తుతం పెట్టుబడిదారులకు భారత్‌ రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలుకుతోంది. ఎఫ్‌డీఐలో సంస్కరణలు, డ్రోన్‌ నియమనిబంధనల్లో సడలింపులు, సెమీకండక్టర్‌ తయారీ దిశగా అడుగులు వేయడంతోపాటు అనేక రంగాల్లో సాధిస్తున్న పురోగతి ఇందుకు నిదర్శనం’’ అని అన్నారు. కరోనా సమయంలో భారత్ చేపట్టిన సాంకేతిక ఆవిష్కరణలతో వైరస్‌ బాధితులను గుర్తించడం నుంచి కొవిన్‌ యాప్‌ ద్వారా వ్యాక్సిన్ పంపిణీని సమర్థవంతంగా నిర్వహించగలిగామని ప్రధాని మోదీ తెలిపారు. ఇది భారత్‌లోని సాంకేతికత అభివృద్ధిని ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. 

దేశ టెలికాం రంగంలో చోటుచేసుకుంటున్న సంస్కరణలతో మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్‌ చేరువవుతోందని వెల్లడించారు. ‘‘గత ఎనిమిదేళ్లలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య 60 మిలియన్‌ నుంచి 810 మిలియన్లకు, స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేవారి సంఖ్య 150 మిలియన్ల నుంచి 750  మిలియన్లకు పెరగడం భారత్‌లో సాంకేతికతలో అభివృద్ధికి నిదర్శనం. 2015లో  గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ ర్యాకింగ్స్‌లో 81వ స్థానంలో ఉన్న భారత్‌ ఈ ఏడాది 40వ స్థానానికి చేరుకుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ హబ్‌గా భారత్‌ అవతరించింది.  మీ పెట్టుబడులు, మా ఆవిష్కరణలు కలిస్తే అద్భుతాలు సాధించవచ్చు’’ అని ప్రధాని వ్యాపారవేత్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని