Indian Navy: పాకిస్థానీ నావికుల్ని కాపాడిన భారత్‌

సోమాలియా సముద్రపు దొంగల బారి నుంచి మరో నౌకను భారత్‌ రక్షించింది.

Updated : 30 Jan 2024 15:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అరేబియా సముద్రం(Arabian Sea)లో 36 గంటల వ్యవధిలో భారత్‌ మరోసారి డేరింగ్ ఆపరేషన్‌ చేపట్టింది. సోమాలియా సముద్రపు దొంగల చెర నుంచి 19 మంది పాకిస్థానీ నావికుల్ని(Pak Sailors) రక్షించింది. యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ సుమిత్రను రంగంలోకి దింపి సముద్రపు దొంగలను తరిమికొట్టింది. ఈ మేరకు భారత నేవీ (Indian Navy) వెల్లడించింది.

సోమవారం సోమాలియా తీరంలో ఇరాన్ జెండాతో ఉన్న అల్‌ నయీమీ ఫిషింగ్ నౌకను సాయుధ సముద్రపు దొంగలు చుట్టుముట్టారు. 19 మంది పాకిస్థానీ నావికుల్ని బంధించారు. దీనిపై సమాచారం అందుకున్న భారత యుద్ధనౌక.. ఓడను అడ్డగించి, బందీలను విడిపించింది.

కొద్ది గంటల ముందు కూడా భారత్ ఇదే తరహా ఆపరేషన్  చేపట్టింది. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇరాన్‌ చేపల బోటు ఇమాన్‌ను సోమాలియా దొంగలు అపహరించారు. రక్షించమంటూ ఈ బోటు నుంచి ఆదివారం భారత్‌ నౌకాదళానికి అత్యవసర సందేశం అందింది. ఐఎన్‌ఎస్‌ సుమిత్ర, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ ధ్రువ్‌ రంగంలోకి దిగి..  17 మంది మత్స్యకారులను రక్షించిన సంగతి తెలిసిందే. 

హమాస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో హూతీ తిరుగుబాటుదారులు గత కొద్ది రోజులుగా ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల గల్ఫ్‌ ఆఫ్ ఎడెన్‌ (Gulf of Aden)లో ఆయిల్‌ ట్యాంకర్లతో వెళుతున్న మార్లిన్‌ లాండ నౌకపై క్షిపణితో దాడి చేశారు. ఆ నౌక నుంచి వచ్చిన అత్యవసర సందేశానికి స్పందించిన భారత నేవీ.. సమీపంలోని ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ను రంగంలోకి దింపి, సహాయ చర్యలు చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని