Manipur Video: మణిపుర్‌ పోలీసుల నిర్లక్ష్యంపై సుప్రీం ఆగ్రహం.. ప్రశ్నల వర్షం!

మణిపుర్‌లో మహిళల్ని వివస్త్రలను చేసి ఊరిలో తిప్పిన ఘటనలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 31 Jul 2023 17:30 IST

దిల్లీ: మణిపుర్‌(Manipur)లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసిన పాశవిక ఘటనను భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. మహిళలపై జరిగిన ఈ దారుణం అత్యంత భయంకరమైందని పేర్కొంది. ఈ ఘటనలో రాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం చేసిన సుప్రీంకోర్టు(Supreme Court).. ఎఫ్‌ఐఆర్‌ దాఖలుకు 14 రోజుల సమయం ఎందుకు పట్టిందో చెప్పాలని ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు అన్ని రోజులు పట్టిందా? అంటూ అసహనం వ్యక్తంచేసింది. ఇప్పటివరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ఆదేశించింది. సాయుధ మూకలకు మహిళల్ని అప్పగించిన పోలీసులే ఈ కేసు దర్యాప్తు చేయడాన్ని తాము కోరుకోవడంలేదని ధర్మాసనం తెలిపింది.  సమగ్ర విచారణ కోసం ప్రత్యేకంగా కమిటీని లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేస్తామని.. అందులో మహిళా జడ్జిలతో పాటు పలువురు నిపుణులు సభ్యులుగా ఉంటారని పేర్కొంటూ తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

మణిపుర్‌లో మహిళలపై చోటుచేసుకున్న దారుణాలపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌(Justice DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసుల తీరును తప్పుపట్టిన ధర్మాసనం.. వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది.

‘అసలు పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఈ ఘోరం మే 4న జరిగితే.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు (18వ తేదీ) 14 రోజులు ఎందుకు పట్టింది. అంతవరకు పోలీసులు(Manipur Police) ఏం చేశారు? నెల తర్వాత (జూన్‌ 24న) దాన్ని మేజిస్ట్రేట్‌ కోర్టుకు ఎందుకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు? ఈ ఘటన భయంకరమైనది. బాధిత మహిళలను సాయుధ మూకకు పోలీసులు అప్పగించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయడాన్ని మేం కోరుకోవడం లేదు’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అయితే, న్యాయస్థానం సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు తమకు కొంత సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్‌.వెంకటరమణి అభ్యర్థించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఇప్పటికే సమయం మించిపోతోందని.. సర్వం కోల్పోయిన బాధితులకు తక్షణమే న్యాయం అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను అందించాలని.. మణిపుర్‌ బాధిత కుటుంబాలకు ఏవిధమైన సాయం అందుతుందో తాము కూడా తెలుసుకోవాలనుకుంటున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

ఇదే అంశంపై సోమవారం ఉదయం కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ సందర్భంగా బాధిత మహిళల తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమీ దాచిపెట్టడం లేదని.. విచారణను సుప్రీం కోర్టు పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వం స్పందించే తీరును బట్టే తమ జోక్యం ఆధారపడి ఉంటుందని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను మంగళవారం( ఆగస్టు 1) మధ్యాహ్నానికి వాయిదా వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు విన్న అనంతరం అనంతరం.. రాష్ట్రంలో పరిస్థితిని పర్యవేక్షించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం లేదా మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని వెల్లడించనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని