Tihar Prison: జైల్లో కేజ్రీవాల్‌.. ‘ఆ పత్రాలపై ఖైదీలు సంతకాలు చేయలేరు’ - జైళ్లశాఖ డీజీ

జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నవారు కేవలం రెండు రకాల పత్రాలపైనే సంతకాలు చేయగలరని, అవి రాజకీయ స్వభావం కలిగి ఉండకూడదని జైళ్లశాఖ వెల్లడించింది.

Published : 16 Apr 2024 00:06 IST

దిల్లీ: దేశ రాజధానిలో మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తిహాడ్‌ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అక్కడినుంచే దిల్లీ పాలనకు సంబంధించిన ఆదేశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే జైల్లో ఆయనకు సరైన వసతులు కల్పించడం లేదని ఆమ్‌ఆద్మీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలపై అక్కడి జైళ్లశాఖ స్పందించింది. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నవారు కేవలం రెండు రకాల పత్రాలపైనే సంతకాలు చేయగలరని, అవి రాజకీయ స్వభావం కలిగి ఉండకూడదని పేర్కొంది.

తిహాడ్‌ జైల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌కు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, నేరస్థుడి కంటే దారుణంగా చూస్తున్నారని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. కుటుంబీకులతో నేరుగా ములాఖత్‌ అయ్యే అవకాశం కల్పించడం లేదని పేర్కొంది.   ఈనేపథ్యంలో దిల్లీ జైళ్లశాఖ డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌ బనివాల్‌ స్పందించారు. పీటీఐ ఎడిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఖైదీలకు కల్పించే సౌకర్యాల్లో ఎలాంటి వివక్ష లేదన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు.

‘కేజ్రీవాల్‌ను కరడుగట్టిన నేరస్థుడిలా చూస్తున్నారు’ - పంజాబ్‌ సీఎం ఆరోపణ

‘‘కరడుగట్టిన, సాధారణ నేరస్థుడికి ఎటువంటి తేడా చూపరు. దిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన మాన్యువల్‌లోనూ ఖైదీల మధ్య ఎటువంటి వివక్ష చూపొద్దనే ఉంటుంది. ప్రతిఒక్క ఖైదీకీ ప్రాథమికంగా కొన్ని హక్కులుంటాయి. అందరికీ వాటిని కల్పించడం నా బాధ్యత’’ అని సంజయ్‌ బనివాల్‌ పేర్కొన్నారు. అయితే, దిల్లీ పాలనకు సంబంధించి వచ్చే వారం నుంచి ఇద్దరు మంత్రులతో భేటీ అవుతానని కేజ్రీవాల్‌ చెప్పడంపైనా జైళ్లశాఖ డీజీ స్పందించారు. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న వ్యక్తి కేవలం రెండు రకాల దస్త్రాలపైనే సంతకాలు చేయవచ్చని.. అవి న్యాయపరమైన, ఫిర్యాదులకు సంబంధించినవే ఉండాలన్నారు. అవి రాజకీయ స్వభావం కలిగి ఉండకూడదని చెప్పారు. ఈనేపథ్యంలో జైలు నుంచే కేజ్రీవాల్‌ తదుపరి ఆదేశాలు ఎలా ఇవ్వనున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని