‘తిహాడ్‌’లో కరోనా.. ఆందోళనలో అధికారులు

దేశ రాజధాని దిల్లీలోని జైళ్లు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. దిల్లీలో రెండో దశ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా.. తిహాడ్‌ సహా మూడు జైళ్లలో

Updated : 14 Apr 2021 17:25 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని జైళ్లు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. దిల్లీలో రెండో దశ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా.. తిహాడ్‌ సహా మూడు జైళ్లలో ఇప్పటివరకు 190 మంది ఖైదీలు, 300 మందికిపైగా సిబ్బంది వైరస్‌ బారిన పడటం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. 

‘‘తిహాడ్‌, రోహిణి, మండోలి జైళ్లలో ఇప్పటివరకు 190 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 121 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ సోకిన 67 మంది ఖైదీలకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక 304 మంది జైలు సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 193 మంది కొవిడ్‌ను జయించగా.. 11 మంది చికిత్స పొందుతున్నారు’’ అని డైరెక్టర్ జనరల్‌(జైళ్లు) సందీప్‌ గోయల్‌ వెల్లడించారు. 

కరోనా తొలి దశలో పదుల సంఖ్యలో ఉన్న కేసులు.. ఇటీవల ఒక్కసారిగా పెరిగాయి. దీంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఖైదీలు సామాజిక దూరం పాటించేలా చూడటంతో పాటు ఎప్పటికప్పుడు జైలు ప్రాంగణాలు శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఖైదీలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 200 మందికి పైగా అర్హత గల ఖైదీలకు టీకాలు వేయించినట్లు అధికారులు చెప్పారు. 

10వేల మంది ఖైదీల సామర్థ్యం కల తిహాడ్‌ జైల్లో ప్రస్తుతం 18,900 మంది ఖైదీలు ఉన్నారు. గతేడాది మార్చిలో ఖరోనా విజృంభించిన తర్వాత 1,184 మంది ఖైదీలు, 5,500 అండర్‌ ట్రయల్స్‌ను అధికారులు అత్యవసర పెరోల్‌పై విడుదల చేశారు. వీరంతా తిరిగి వస్తే ఈ సంఖ్య 20వేలు దాటుతుందని అధికారులు చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని