LPG price: వంటగ్యాస్‌ మంట.. ఏడాదిలో రూ.244 పెంపు

మే నెల నుంచి గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగడం మూడోసారి కాగా గడిచిన ఏడాది కాలంలో వంటగ్యాస్‌ ధర ఏకంగా రూ.244 పెరగడం గమనార్హం.

Updated : 06 Jul 2022 14:16 IST

ఆకాశాన్నంటుతున్న ఇంధనం, గ్యాస్‌ ధరలు

దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశంలో ఇంధనం, వంటగ్యాస్‌ (Cooking gas) ధరలు భారీగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్‌ (LPG) ధర సిలిండర్‌కు మరోసారి రూ.50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇవి నేటి నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో సిలిండర్‌ (Gas Cylinder) ధర రూ.1100 దాటింది. మే నెల నుంచి ఇలా పెరగడం మూడోసారి కాగా గడిచిన ఏడాది కాలంలో వంటగ్యాస్‌ ధర ఏకంగా రూ.244 పెరగడం గమనార్హం.

మూడునెలల్లో రూ.153 పెంపు

ఈ ఏడాదిలోనే వంటగ్యాస్‌ ధర నాలుగుసార్లు పెరగగా.. కేవలం మే తర్వాతే మూడుసార్లు పెరిగింది. పెరిగిన ప్రతిసారి దాదాపు యాభై రూపాయలకు తగ్గకుండా భారాన్ని వేస్తున్నాయి. మార్చి 22వ తేదీన సిలిండర్‌ ధర రూ.50 పెరిగింది. మళ్లీ మే 7న మరో యాభై పెరగగా.. మే 19న మాత్రం రూ.3.50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మార్చి నెల నుంచి మొత్తంగా ఒక్కో సిలిండర్‌పై రూ.153.50 పెంచాయి. ఇలా గతేడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు చూస్తే సిలిండర్‌ ధర రూ.244 ఎగబాకింది.

ఇక రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు మాత్రం గడిచిన మూడు నెలలుగా బ్రేక్‌ పడింది. మే నెలలో పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గించడంతో వాటి దూకుడుకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. అదే సమయంలో వంటగ్యాస్‌పై రూ.200 సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఉజ్వల యోజన పథకం (PM Ujjwala Yojana Scheme) కింద వంటగ్యాస్‌ సిలిండర్‌ పొందిన వారికే అది వర్తిస్తుందని తెలిపింది. దీంతో కేవలం 9కోట్ల మంది పేద మహిళలు, ఇతరులకు మాత్రమే లబ్ధిచేకూరుతోంది. మిగతా వాళ్లు మాత్రం వంటగ్యాస్‌కు మార్కెట్‌ ధర చెల్లించాల్సి వస్తోంది.

వాణిజ్య సిలిండర్‌పై బాదుడే..

ఇలా వంటగ్యాస్‌పై క్రమంగా భారం పడడంతో పలు నగరాల్లో సిలిండర్‌ ధర రూ.1100లు దాటింది. దేశరాజధాని దిల్లీలో సిలిండర్‌ ధర రూ.1053కు చేరుకోగా.. ముంబయిలో రూ.1052.50, చెన్నై-రూ.1079, కోల్‌కతాలో రూ.1068.50కి చేరింది. హైదరాబాద్‌లో మాత్రం అత్యధికంగా ఒక్క సిలిండర్‌కు రూ.1105 చెల్లించాల్సి వస్తోంది. ఇంధనంపై రాష్ట్రాలు విధించే వ్యాట్‌లు వేర్వేరుగా ఉండడం వల్ల ఆయా రాష్ట్రాల్లో వీటి ధర మారుతోంది. వంటగ్యాస్‌ ధర ఇలా ఉంటే, వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌పైనా చమురు సంస్థలు తీవ్ర భారాన్ని మోపుతూనే ఉన్నాయి. దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.2వేలు దాటగా ఇతర రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా ఉంది.

ఇదిలాఉంటే, దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 85శాతం విదేశాల నుంచి దిగుమతిపైనే భారత్‌ ఆధారపడిన సంగతి తెలిసిందే. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తుండడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో దిగుమతుల కోసం భారత్‌ భారీగా చెల్లింపులు చేయాల్సి వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని