Madras HC: కలెక్టర్లకు ఈడీ నోటీసులు చట్ట విరుద్ధం: మద్రాసు హైకోర్టు

తమిళనాడులోని అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి మనీలాండరింగ్ చట్టం కింద ఐదుగురు జిల్లా కలెక్టర్లకు ఈడీ జారీ చేసిన నోటీసులపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. 

Published : 28 Nov 2023 14:47 IST

చెన్నై: అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించిన కేసులో జిల్లా కలెక్టర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) నేరుగా సమన్లు జారీ చేయడాన్ని మద్రాసు హైకోర్టు (Madras High Court) తప్పుపట్టింది. ఈడీ నోటీసులపై మూడు వారాలపాటు స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. తమిళనాడు (TamilNadu)లో అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (PMLA) కింద రాష్ట్ర మానవ వనరుల విభాగం కార్యదర్శితోపాటు అరియలూర్‌, వెల్లూర్‌, తంజావూర్‌, కరూర్‌, తిరుచ్చిరాపల్లి కలెక్టర్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన వివరాలను స్వయంగా కలెక్టర్లు దర్యాప్తు సంస్థకు అందజేయాలని నోటీసుల్లో పేర్కొంది. 

ఈ నోటీసులపై ఆరుగురు అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం దీనిపై జస్టిస్‌ ఎస్ఎస్‌ సుందర్‌, జస్టిస్‌ సుందర్‌ మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఈడీ నోటీసులపై మూడు వారాలపాటు స్టే విధించింది. ఈడీ కేసు విచారణను కొనసాగించవచ్చని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కలెక్టర్లకు సమన్లు జారీ చేయడం చట్ట విరుద్ధమన్న తమిళనాడు ప్రభుత్వ వాదనతో ద్విసభ్య ధర్మాసనం ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను డిసెంబరు 21కి వాయిదా వేసింది. విచారణ పేరుతో దర్యాప్తు సంస్థ కలెక్టర్లకు సమన్లు జారీ చేయడం ఏకపక్ష నిర్ణయమని, జిల్లా కలెక్టర్లకు నేరుగా సమన్లు జారీ చేసే అధికారం ఈడీకి లేదని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహాయాన్ని కోరే అధికారం మాత్రమే ఈడీకి ఉందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని