Jammu and Kashmir: సరిహద్దుల్లో అలజడి.. ఉగ్రవాదుల భారీ చొరబాటు కుట్ర భగ్నం

Jammu and Kashmir: భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. వారిపై కాల్పులు జరిపి తరిమికొట్టాయి.

Updated : 23 Dec 2023 10:40 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని అంతర్జాతీయ సరిహద్దు (International Border) వెంబడి తీవ్ర అలజడి చోటుచేసుకుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన భారీ కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. చిమ్మచీకట్లో చొరబాటు (infiltration)కు యత్నించిన ముష్కరులను తరిమికొట్టాయి. ఈ మేరకు ఆర్మీ (Army) అధికారులు శనివారం వెల్లడించారు.

అఖ్నూర్‌లోని ఖోర్‌ సెక్టార్‌లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుధాలతో అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు యత్నించారు. నిఘా పరికరాల సాయంతో వీరిని గుర్తించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై కౌంటర్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ముష్కరులపై కాల్పులు చేపట్టారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతిచెందినట్లు తెలుస్తోంది.

పూంఛ్‌ సెక్టార్‌లో 30మంది ఉగ్రవాదులు

భద్రతా సిబ్బంది కాల్పులతో ఉగ్రవాదులు వెనక్కి పారిపోయారని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ మృతదేహాన్ని మిగతా ముష్కరులు తమతో పాటు లాక్కెళ్లినట్లు తెలిపారు. కాగా.. జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న భీకర ఉగ్రదాడి వేళ.. ఉగ్రవాదుల చొరబాటు ఘటన కలకలం రేపింది.

పూంఛ్‌ జిల్లాలో జవాన్లను తరలిస్తున్న సైనిక వాహనాలపై పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా దళాలు ముమ్మర వేట సాగిస్తున్నాయి. మరోవైపు, పూంఛ్‌ సెక్టార్‌లో దాదాపు 25 నుంచి 30 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు నక్కినట్లు భారత సైన్యం అంచనా వేస్తోంది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి దాదాపు 300 మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని, వారంతా భారత్‌లో చొరబాటుకు వేచి చూస్తున్నారని ఇటీవల బీఎస్‌ఎఫ్‌ ఐజీ అశోక్‌ యాదవ్‌ కూడా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని