మోదీజీ.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి!

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు దాని కట్టడికి చేపట్టాల్సిన పలు సూచనలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తున్నారు. తాజాగా రాజ్యసభలో కాంగ్రెస్‌పక్ష నేత.......

Updated : 10 May 2021 06:31 IST

ప్రధానికి లేఖ రాసిన మల్లిఖార్జున ఖర్గే

దిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు దాన్ని కట్టడి చేయడానికి పలు సూచనలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తున్నారు. తాజాగా రాజ్యసభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మోదీకి పలు అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు. కరోనా నుంచి ఆత్మీయుల్ని రక్షించుకోవడం కోసం భూమి, ఆభరణాలు అమ్ముకోవడంతో పాటు దాచిపెట్టుకున్న సొమ్మంతా ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని ఖర్గే లేఖలో పేర్కొన్నారు.

కరోనాపై చేస్తున్న పోరులో అందరినీ కలుపుకొని పోవాలని ప్రధానికి ఖర్గే సూచించారు. కేంద్ర ప్రభుత్వం తన విధుల్ని నిర్వర్తించడంలో విఫలమైన నేపథ్యంలో పౌర సమాజం, సంస్థలు మహమ్మారిపై గొప్ప పోరాటం చేస్తున్నాయన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అందరికీ సమ్మతమైన ఒక వ్యూహాన్ని రచించాలని కోరారు. అలాగే కేంద్ర బడ్జెట్‌లో వ్యాక్సిన్ల కోసం కేటాయించిన రూ.35 వేల కోట్లను వినియోగించాలని.. తద్వారా ప్రతి భారతీయుడికి టీకా అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

టీకా ఉత్పత్తిని మరింత పెంచడానికి తప్పనిసరి లైసెన్సింగ్‌ విధానం అమల్లోకి తీసుకురావాలని ఖర్గే కోరారు. అలాగే, వ్యాక్సిన్లు, పీపీఈ కిట్లు, అంబులెన్సులు, ఆక్సిజన్‌పై ఉన్న జీఎస్టీని రద్దు చేయాలన్నారు. ప్రజలు దారుణమైప పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారి నుంచి ఆదాయం సమకూర్చుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. అలాగే విదేశాల నుంచి అందిన వైద్య సామగ్రి పంపిణీని వేగవంతం చేయాలని కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కనీస భత్యాన్ని పెంచడంతో పాటు పనిదినాలను 100 నుంచి 200కు పెంచాలని కోరారు.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ప్రధానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి కొంతమంది నాయకులు లేఖలు రాశారు. రాహుల్‌ గాంధీ అనేక సూచనలు చేస్తూ మోదీకి పలుసార్లు లేఖలు పంపారు. బంగాల్‌ ముఖ్యమంత్రి దీదీ సైతం పలు సార్లు లేఖలు రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని