Himachal Pradesh: నాన్నా.. మనం కూడా చనిపోతామా..?: శిమ్లా హారర్‌ను వెల్లడించిన స్థానికుడు

ఇటీవల కురిసిన వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh Rains)లో బీభత్సం సృష్టించాయి. దాంతో కొండచరియలు విరిగిపడి.. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.  

Published : 17 Aug 2023 16:43 IST

శిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh Rains)ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈ వానల ధాటికి రాజధాని నగరం శిమ్లా(Shimla)లోని  సమ్మర్ హిల్‌ ప్రాంతం( Summer Hill Area)లో కొండచరియలు(landslides) బీభత్సం సృష్టించాయి. దాంతో ఆ పరిసర ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టారు. ఈ ప్రకృతి విపత్తును దగ్గరి నుంచి చూసిన స్థానికుడు ఒకరు ఆ భయానక అనుభవాలను వెల్లడించారు. తన కుమార్తె తనతో పలికిన మాటలు తలచుకొని ఉద్వేగానికి గురయ్యారు. 

‘‘నాన్నా.. మనం కూడా చనిపోతామా..? మన ఇల్లు కూడా కూలిపోతుందా..?’ అని నా ఆరేళ్ల కుమార్తె ప్రశ్నించింది. భయం నిండిన ఆమె కళ్లు చూసి అంతులేని వేదనకు గురయ్యాను’ అంటూ ఆ వ్యక్తి వెల్లడించారు. ఆ వ్యక్తి ఇంటికి  100 మీటర్ల దూరంలో కొండచరియలు(landslides) విరిగిపడ్డాయి. దాంతో ఎన్నో భవనాలు వాటికింద పడి శిథిలాలుగా మారాయి. వాటిలో ఒక మాంసాహార దుకాణం కూడా ఉంది. అలాగే శివాలయంపై కొండచరియ విరిగి పడిన ప్రాంతం కూడా తమ ఇంటికి దగ్గరే ఉందన్నారు. 

నడిసంద్రంలో చైనీయుడికి కార్డియాక్‌ అరెస్ట్‌.. చిమ్మచీకట్లో భారత్‌ సాహసోపేత ఆపరేషన్‌

‘అయిన వాళ్లు, ఇళ్లు కోల్పోయిన వారి ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఓ మహిళ తన భర్తను వెతుక్కుంటూ పరుగులు పెట్టింది. మాంసాహార దుకాణంలో పనిచేసే వ్యక్తి తన యజమాని కోసం గాలించాడు. వానల వల్ల కరిగిన మట్టి కిందికి జారుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికుల్ని ఘటనా స్థలం నుంచి దూరంగా పంపే విషయంలో విపత్తు నిర్వహణ సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మీ కాళ్లు పట్టుకుంటేనే.. ఇక్కడి నుంచి వెళ్తారా..? అని సిబ్బంది ఒకరు అడగడం వినిపించింది’ అని చెప్పారు. మరికొందరు తమ చేతనైన సామాన్లు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. 

మూడురోజుల పాటు భారీగా కురిసిన వర్షాలతో శిమ్లాలోని పలు ప్రాంతాలు భారీగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ విరిగి పడిన చెట్లు, తెగిపడిన విద్యుత్‌ తీగలు కనిపించాయి. భవనాలు, రోడ్లకు పగుళ్లు కనిపించాయి. ఈ విపత్తు వల్ల ఒక్క శిమ్లాలోనే 30 మంది మరణించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 70 మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా శిథిలాల కింద మృతదేహాలను వెలికితీస్తే.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రకృతి విలయం వల్ల రూ.10 వేలకోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు, సాధారణ స్థితి నెలకొనడానికి ఏడాది పట్టొచ్చని సీఎం వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని