నడిసంద్రంలో చైనీయుడికి కార్డియాక్‌ అరెస్ట్‌.. చిమ్మచీకట్లో భారత్‌ సాహసోపేత ఆపరేషన్‌

అరేబియా సముద్రంలో ఓ చైనీయుడు తీవ్ర గుండెనొప్పికి గురయ్యాడు. సమాచారమందుకున్న భారత కోస్ట్‌ గార్డ్‌ (Indian Coast Guard) అతడిని రక్షించేందుకు సాహసోపేతమైన ఆపరేషన్‌ చేపట్టింది.

Updated : 17 Aug 2023 11:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నడి సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ చైనా వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కార్డియాక్‌ అరెస్ట్‌ (cardiac arrest)కు గురవడంతో అతడిని కాపాడేందుకు భారత కోస్ట్‌గార్డ్‌ (Indian Coast Guard) ప్రతికూల వాతావరణంలో సాహసోపేతమైన ఆపరేషన్‌ చేపట్టింది. చిమ్మచీకట్లో అతడిని ఎయిర్‌లిఫ్ట్‌ చేసి ఆసుపత్రికి తరలించింది.

పనామా పతాకంతో ఉన్న ఎంవీ డాంగ్‌ ఫాంగ్‌ కాన్‌ టాన్‌ నంబర్‌ 2 రీసర్చ్‌ నౌక  చైనా నుంచి అరేబియా సముద్రం (Arabian Sea) మీదుగా యూఈఏ (UAE) వెళ్తోంది. బుధవారం రాత్రి ఈ నౌకలో పనిచేస్తున్న సిబ్బంది యిన్‌ వీగ్‌యాంగ్‌ కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. ఛాతినొప్పితో విలవిల్లాడిపోయారు. దీంతో నౌక సిబ్బంది సమీప తీర ప్రాంతమైన ముంబయిలోని మారిటైమ్‌ రెస్క్యూ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు అత్యవసర సందేశం పంపారు.

హాట్‌ చాక్లెట్‌తో చిన్నారికి గాయాలు.. విస్తారా విమానంలో ఘటన

దీంతో అప్రమత్తమైన భారత కోస్ట్‌గార్డ్‌ (Indian Coast Guard) సిబ్బంది బాధితుడిని అత్యవసరంగా ఆసుపత్రికి చేర్చేందుకు ఏఎల్‌హెచ్‌ ఎంకే-3 హెలికాప్టర్‌తో బయల్దేరారు. ఆ సమయంలో చైనా నౌక అరేబియా సముద్రంలో తీరానికి దాదాపు 200 కి.మీల దూరంలో ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. అయినప్పటికీ కోస్ట్‌గార్డ్‌ చిమ్మచీకట్లో ధైర్యంగా ఈ ఆపరేషన్‌ చేపట్టింది. 

అర్ధరాత్రి సమయంలో నౌకలో నుంచి వీగ్‌యాంగ్‌ను ఎయిర్‌లిఫ్ట్‌ చేసి హెలికాప్టర్‌లోనే ప్రథమ చికిత్స అందించింది. అనంతరం సమీప ఆసుపత్రికి తరలించినట్లు భారత రక్షణ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని