Mizoram: మయన్మార్‌ నుంచి వందల్లో సైనికులు.. కేంద్రాన్ని ఆశ్రయించిన మిజోరం

మయన్మార్‌(Myanmar)లో అంతర్యుద్ధం భారత్‌పై ప్రభావం చూపుతోంది. ఆ దేశానికి చెందిన వందలాది సైనికులు పారిపోయి మనవైపు వస్తున్నారు. 

Updated : 20 Jan 2024 15:59 IST

ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌ పొరుగు దేశమైన మయన్మార్‌ (Myanmar)లో కొంతకాలంగా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. మిలిటరీ పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య పోరు జరుగుతోంది. దీంతో మయన్మార్‌ ఆర్మీకి చెందిన వందలమంది సిబ్బంది మిజోరం(Mizoram) సరిహద్దుల ద్వారా భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఈ పరిణామాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది. వారిని తిరిగివెంటనే వెనక్కి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

మయన్మార్‌లో పాలన కొనసాగిస్తోన్న మిలిటరీకి కొంతకాలంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజాస్వామ్య అనుకూలవాదులతో కూడిన సాయుధ బృందాలు కూటములుగా ఏర్పడి గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ ఘర్షణల వల్ల ఇప్పటివరకు 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి మనదేశంలోకి ప్రవేశించారు. రెబల్‌ గ్రూప్‌ అరాకన్‌ ఆర్మీ తమ శిబిరాలను స్వాధీనం చేసుకోవడంతో వారంతా మిజోరంలోని లాంగ్‌ట్లాయ్‌ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అస్సాం రైఫిల్స్ క్యాంపుల్లో వారు ఉంటున్నట్లు తెలుస్తోంది.

దూకుడు పెంచిన కిమ్‌.. సముద్రగర్భంలో డ్రోన్‌ అణుసామర్థ పరీక్షలు

ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి లాల్‌దుహోమా (Lalduhoma).. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో చర్చించారు. ‘ఆశ్రయం పొందేందుకు మయన్మార్ నుంచి ప్రజలు మనదేశంలోకి ప్రవేశిస్తున్నారు. మానవతా దృక్పథంతో మేం వారికి సాయం చేస్తున్నాం. ఆ దేశం నుంచి సైనికులు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే 400 మందిని వెనక్కి పంపించేశాం’ అని సమావేశం అనంతరం సీఎం మీడియాకు వెల్లడించారు. మయన్మార్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే మిజోరం కేంద్రాన్ని అభ్యర్థించింది.

మయన్మార్‌లో 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి సైనిక పాలకులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజాస్వామ్య అనుకూల గ్రూపులు పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలతో దేశంలో అంతర్యుద్ధం నెలకొంది. ఈ దాడుల్లో ‘త్రీబ్రదర్‌హుడ్‌ అలయన్స్‌ (టీబీఏ)’ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో మయన్మార్‌ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్‌డీఏఏ), టాంగ్‌ జాతీయ విమోచన సైన్యం(టీఎన్‌ఎల్‌ఏ), అరాకన్‌ ఆర్మీ(ఏఏ) భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దేశంలో అత్యంత శక్తిమంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలుగా వీటికి పేరుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని