Monsoon: సీన్‌ రిపీట్‌.. 62 ఏళ్ల తర్వాత రెండు మహానగరాలకు ఒకేసారి రుతుపవనాలు

దాదాపు 62 ఏళ్ల తర్వాత దిల్లీ, (Delhi) ముంబయి (Mumbai) మహానగరాలను నైరుతి రుతుపవనాలు (Monsoon) ఒకేసారి పలకరించాయి. గతంలో జూన్‌ 21,1961లో ఇలా జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.

Published : 25 Jun 2023 19:58 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi), ఆర్థిక రాజధాని ముంబయి (Mumbai) నగరాలను వర్షాలు మంచెత్తుతున్నాయి. రుతుపవనాల కారణంగా ఈ రెండు మహానగరాల్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. దాదాపు 62 సంవత్సరాల తర్వాత ఈ రెండు మహానగరాలను ఒకేసారి రుతుపవనాలు పలకరించాయి. భారత వాతావారణశాఖ అంచనాల ప్రకారం దిల్లీలో మరో రెండు రోజుల తర్వాత రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. కానీ, ముందుగానే వచ్చేశాయి. ముంబయికి రెండు వారాలు ఆలస్యంగా చేరుకున్నాయి. దీంతో ఒకేసారి రెండు నగరాల్లోనూ రుతుపవనాలు ప్రవేశించినట్లయింది. గతంలో జూన్‌ 21, 1961లో ఇలాగే రెండు మహానగరాల్లోనూ ఒకేసారి రుతుపవనాలు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి.

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ తాజాగా వెల్లడించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ తోపాటు హరియాణా, గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌,  రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు పేర్కొంది. మరో రెండు రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశముందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర వెల్లడించారు. తాజా వర్షాలతో దిల్లీ, పరిసర ప్రాంతాల్లో కొంత ఉపశమనం కలిగినప్పటికీ.. గురుగ్రామ్‌లో కొన్ని చోట్ల మాత్రం ఎండల తీవ్రత కొనసాగుతోంది. మరోవైపు ముంబయిలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

రుతుపవనాలు సాధారణంగా జూన్‌ 1 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ, ఈ ఏడాది వారం రోజుల ఆలస్యంగా జూన్‌ 8న చేరుకున్నాయి. వర్షాలు విస్తారంగా కురిసేందుకు అనువైన పరిస్థితులు వృద్ధి చెందుతున్నప్పటికీ.. నైరుతి రుతుపవనాలతో భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని