Pappu Yadav: ప్రమాణం చేయకముందే.. చిక్కుల్లో పడ్డ పప్పూ యాదవ్‌

బిహార్‌లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పప్పూ యాదవ్‌పై కేసు నమోదైంది. ప్రమాణం కూడా చేయకముందే ఆయనపై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

Updated : 11 Jun 2024 12:40 IST

పట్నా: బిహార్‌ (Bihar) ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్‌ (Pappu Yadav) చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆయనపై కేసు నమోదైంది. డబ్బు కోసం చంపేస్తానంటూ ఎంపీ బెదిరించారని ఓ వ్యాపారి పూర్ణియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

 జిల్లాలో ఓ వ్యక్తి కొన్నేళ్లుగా ఫర్నిచర్‌ వ్యాపారం చేస్తున్నాడు. పప్పూ యాదవ్‌ రూ. కోటి ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. తాను ఎంపీగా ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటానని.. ప్రశాంతంగా వ్యాపారం చేయాలనుకుంటే అడిగిన మొత్తం ఇవ్వాలన్నారు. లేదంటే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదంతా ఎన్నికల ఫలితాల రోజు జరిగినట్లు తెలుస్తోంది. ప్రాణ భయంతో వ్యాపారి పప్పూ సహా అతడి వ్యక్తిగత సహాయకుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నాపై కుట్ర జరుగుతోంది..

గతంలోనూ పప్పూ ఇలాగే బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పప్పూ సహా అతడి సహాయకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనపై వచ్చిన ఆరోపణలపై పప్పూ యాదవ్‌ స్పందించారు. ‘‘ ప్రజలకు నాపై అభిమానం పెరుగుతోంది. దీన్ని సహించలేని వారు కుట్ర పన్నుతున్నారు. పూర్ణియాలో ప్రత్యర్థులు, అధికారులు నాపై చేస్తున్న కుట్రను త్వరలోనే బయటపెడతా. న్యాయస్థానం సమగ్ర విచారణ జరిపి దోషులను ఉరి తీసే రోజు వస్తుంది’’ అని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా హెచ్చరించారు.

మోదీ క్యాబినెట్‌లో స్థానం దక్కని వేళ.... శరద్‌ పవార్‌కు అజిత్‌ కృతజ్ఞతలు

ఇదిలా ఉండగా.. ఎన్నికల నేపథ్యంలో జన్‌ అధికార్ పార్టీ అధినేత పప్పూ యాదవ్‌ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. అయినా.. ఆయనకు ఎంపీ టికెట్‌ దక్కలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. తన సమీప ప్రత్యర్థి జేడీ(యూ) అభ్యర్థి సంతోశ్‌ కుష్వాహాపై 23 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని