Digital Highway: డిజిటల్‌ హైవేగా మారనున్న హైదరాబాద్‌-బెంగళూరు మార్గం..!

డిజిటల్‌ హైవేలను (Digital Highways) అందుబాటులోకి తేవడంలో భాగంగా దిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేతోపాటు హైదరాబాద్‌-బెంగళూరు మార్గాలను పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంచుకున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Published : 19 Apr 2023 21:12 IST

దిల్లీ: 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో 10వేల కిలోమీటర్ల మేర ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ (OFC) మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కృషి చేస్తోందని తెలిపింది. ఇందులో భాగంగా 1367 కి.మీ దిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేతోపాటు 512కి.మీ హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్లను పైలట్‌ ప్రాజెక్టు కింద గుర్తించామని పేర్కొంది. జాతీయ రహదారుల వెంట ఇంటిగ్రేటెడ్‌ యుటిలిటీ కారిడార్లను అభివృద్ధి చేయడం ద్వారా ఓఎఫ్‌సీ (Optical Fibre Cables) మౌలికసదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ ‘డిజిటల్‌ హైవేస్‌’ను (Digital Highways) ఎన్‌హెచ్‌ఏఐ ఆధీనంలో ప్రత్యేకంగా ఏర్పాటైన నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజిమెంట్‌ లిమిటెడ్‌ (NHLML) అమలు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

దేశంలో మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అందించడంతోపాటు 5జీ, 6జీ వంటి నవతరం టెలికాం సాంకేతికతలను మరింత వేగంగా విస్తరించేందుకు ఈ ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌ దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హైవేలలో ఓఎఫ్‌సీ వేసే ప్రక్రియ మొదలయ్యిందని.. మరో ఏడాదిలో పూర్తవుతుందని తెలిపింది. దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ దారిలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన 246కి.మీల దిల్లీ-దౌసా-లాల్‌సోట్ మార్గంలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లను వినియోగించేందుకు మూడు మీటర్ల స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించామని పేర్కొంది.

ఈ ఓఎఫ్‌సీ ద్వారా ‘ఫ్లగ్‌ అండ్‌ ప్లే’ లేదా ‘ఫైబర్‌ ఆన్‌ డిమాండ్‌’ పద్ధతిలో టెలికాం/ఇంటర్నెట్‌ సేవలు పొందే వీలుంటుంది. ఓ వెబ్‌ పోర్టల్‌ ద్వారా అర్హత ఉన్న వినియోగదారులకు నిర్దేశిత ధరకు లీజుకు ఇస్తారు. దీని కేటాయింపునకు సంబంధించి అవసరమైన విధివిధానాలను టెలికమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖతోపాటు నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో సంప్రదింపుల తర్వాత ఖరారు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డిజిటల్ హైవేలను సృష్టించడం కేవలం అభివృద్ధి, పురోగతిలో విప్లవాత్మక మార్పులు చూపించడమే కాకుండా దేశంలోని డిజిటల్‌ మార్పునకు ఇది ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని