Lok Sabha Polls: అటువంటి ప్రచారాలకు దూరంగా ఉండండి.. పార్టీలకు ‘ఈసీ’ హెచ్చరిక

ఎన్నికల ప్రచారంలో భాగంగా అవాస్తవమైన, ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయొద్దని పార్టీలు, నేతలకు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Updated : 01 Mar 2024 20:53 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తోన్న వేళ రాజకీయ పార్టీలు, నేతలకు ఎన్నికల సంఘం (Election Commission) కీలక సూచనలు జారీ చేసింది. ప్రచారంలో భాగంగా అవాస్తవమైన, ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయొద్దని స్పష్టం చేసింది. సామాజిక వర్గం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగొద్దని, వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct)ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ముఖ్యంగా గతంలో నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొంది.

ప్రార్థనా మందిరాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారానికి వాడుకోవద్దని ఈసీ స్పష్టం చేసింది. ప్రచారంలో మర్యాదపూర్వకంగా, నైతిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. సమస్యలే ప్రధానాంశాలుగా ఎన్నికల్లో ముందుకెళ్లాలని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది. ప్రత్యర్థులను దూషించే, కించపరిచే పోస్టులకు దూరంగా ఉండాలని పేర్కొంది. విభజనవాదం, వ్యక్తిగత దాడులకు బదులు నైతికమైన, గౌరవప్రదమైన రాజకీయ చర్చలను ప్రోత్సహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్ కుమార్ సైతం ఇటీవల పార్టీలకు సూచించారు.

ఓటర్లకు ఆ హక్కు ఉంది: ఎన్నికల సంఘం

ప్రచార కార్యక్రమాల్లో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగం చేయొద్దని ఇటీవల అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. బాల కార్మిక చట్టాలు, నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూసుకునే బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టం చేసింది. ఎన్నికల సందర్భంగా నేతలు ఇచ్చే హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని, అదేవిధంగా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చే హక్కు పార్టీలకూ ఉంటుందని సీఈసీ రాజీవ్‌కుమార్‌ ఇటీవల పేర్కొన్నారు. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ఈసీ అధికారులు రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని