XE Variant: ఎక్స్‌ఈ వేరియంట్‌పై ఆందోళన.. కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ ఏమన్నారంటే..!

ఎక్స్‌ఈ వేరియంట్‌పై ఆందోళన వ్యక్తమవుతోన్న నేపథ్యంలో.. ఈ కొత్త వేరియంట్‌పై భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ స్పష్టం చేసింది.

Published : 11 Apr 2022 14:12 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోన్న వేళ.. పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్‌ కేసులు బయటపడుతున్నాయి. అత్యంత సాంక్రమిక శక్తి కలిగినట్లు భావిస్తోన్న ‘ఎక్స్‌ఈ’ వేరియంట్ కేసులు గుజరాత్‌, మహారాష్ట్రలో వెలుగు చూశాయి. దీంతో మరోసారి కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతుండడంతో కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ స్పందించింది. కొత్త వేరియంట్‌పై భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తీవ్ర వ్యాధికి కారణమవుతుందని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని.. వేగంగా వ్యాప్తి చెందుతుందనడంపైనా ఎటువంటి సమాచారం లేదని పేర్కొంది.

‘ఒమిక్రాన్‌ నుంచి ఎన్నో కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయి. ఎక్స్‌ఈ తోపాటు ఇతర రకాలు కేవలం ఎక్స్‌ సిరీస్‌లో భాగమే. ఇటువంటి వేరియంట్లు వస్తూనే ఉంటాయి. వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి భారత్‌లో ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి ఇటువంటి వాటిపై భయపడాల్సిన అవసరం లేదు’ అని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) చీఫ్‌ ఎన్‌కే అరోఢా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, ఒమిక్రాన్‌ ఉపరకాలైన బీఏ.1, బీఏ.2 ల మిశ్రమం ఉత్పరివర్తనంగా భావిస్తోన్న ఎక్స్‌ఈ వేరియంట్‌ తొలుత బ్రిటన్‌లో వెలుగు చూసింది. అనంతరం, థాయిలాండ్‌, న్యూజిలాండ్‌ దేశాలకూ పాకింది. తాజాగా ఈ వేరియంట్‌ కేసులు గుజరాత్‌, మహారాష్ట్రలో నమోదైనట్లు స్థానిక ప్రభుత్వాలు వెల్లడించాయి. అయితే, ఎక్స్‌ఈ వేరియంట్‌ వ్యాప్తి, తీవ్రతపై స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ వేరియంట్‌ అధిక సాంక్రమికశక్తి కలిగివున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్‌లో ఇప్పటివరకు ఉన్న ఇతర ఉత్పరివర్తనాల కంటే వ్యాపించే గుణం ఎక్స్‌ఈ వేరియంట్‌కు దాదాపు 10శాతం ఎక్కువ ఉన్నట్లు బ్రిటన్‌ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని