Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. సీబీఐ ఛార్జీషీటు దాఖలు

ఒడిశా రైలు దుర్ఘటనలో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ముగ్గురు రైల్వే ఉద్యోగులపై నేరాభియోగాలు మోపింది.

Published : 02 Sep 2023 18:16 IST

భువనేశ్వర్‌: ఒడిశా రైలు దుర్ఘటన (Odisha Train Tragedy)లో 296 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 1200 మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. ముగ్గురు రైల్వే ఉద్యోగులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీటు (Charge Sheet) దాఖలు చేసింది. రైల్వే చట్టంలోని 153 సెక్షన్‌తోపాటు సాక్ష్యాలను నాశనం చేసేందుకు యత్నించడం, హత్యతో సమానమైన నేరాభియోగాల (Culpable Homicide)ను మోపింది. రైలు ప్రమాదంలో కుట్ర కోణం అనుమానాల నేపథ్యంలో రంగంలోకి దిగిన సీబీఐ.. జులై 7న సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ (సిగ్నల్స్‌) అరుణ్‌కుమార్‌ మహంత, సెక్షన్‌ ఇంజినీర్‌ అమీర్‌ ఖాన్‌, టెక్నిషియన్‌ పప్పు కుమార్‌లను అరెస్టు చేసింది.

‘బాహానగా బజార్‌ స్టేషన్‌ సమీపంలో ప్రమాదం జరిగిన 94వ లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌ వద్ద మరమ్మతు పనులు మహంత సమక్షంలోనే జరిగాయి. అయితే, ఈ పనులకు 79వ లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌కు సంబంధించిన సర్క్యూట్ రేఖాచిత్రాన్నే ఉపయోగించారు’ అని సీబీఐ పేర్కొంది. ‘ఇప్పటికే ఉన్న సిగ్నల్, ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలను పరీక్షించడం, మరమ్మతులు చేపట్టడం, మార్పులు చేయడమనేది.. ఆమోదిత ప్రణాళిక, సూచనలకు అనుగుణంగా ఉన్నాయనేది నిర్ధారించుకోవడం మహంత పని. కానీ, ఆయన దీన్ని విస్మరించారు’ అని తెలిపింది. ఇటీవల మహంత బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగానూ సీబీఐ ఇదే వాదనలు వినిపించింది. దీంతో కోర్టు ఆయనకు బెయిల్‌ నిరాకరించింది.

ఒడిశా రైలు దుర్ఘటన.. కీలక వివరాలు వెల్లడించిన సీబీఐ

జూన్‌ 2న బాలేశ్వర్‌ జిల్లాలోని బాహానగా బజార్‌ స్టేషన్‌ వద్ద.. లూప్‌లైన్‌లో ఆగిఉన్న గూడ్సు రైలును షాలీమార్‌-చెన్నై కోరమాండల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొన్న విషయం తెలిసిందే. ఆ తీవ్రతకు కోరమాండల్‌లోని కొన్ని బోగీలు ఎగిరి, పక్కనున్న ట్రాకుపై పడ్డాయి. దీంతో అప్పటికే ఆ మార్గంలో దూసుకెళ్తోన్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ రైలులోని కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఇదంతా క్షణాల్లో జరిగిపోవడంతో పెను విషాదం చోటుచేసుకుంది. అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడమే ఈ ఘటనకు దారితీసిందని సీబీఐ ఇదివరకే వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని