Rahul Gandhi: ‘స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌’లో మోదీ, షా.. రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఫలితాల రోజున స్టాక్‌ మార్కెట్ల పతనాన్ని అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించారు.

Updated : 06 Jun 2024 20:06 IST

Rahul Gandhi | దిల్లీ: ఎన్నికల ఫలితాల రోజు స్టాక్‌ మార్కెట్‌ (Stock market) చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ నష్టాలను మూటగట్టుకుంది. దీంతో సుమారు రూ.30లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ఈ ఉదంతంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. దీన్ని ‘అతిపెద్ద స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌’గా అభివర్ణించారు. ఇందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా పాత్ర ఉందని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఫేక్‌ ఎగ్జిట్‌ పోల్స్‌తో జూన్‌ 3న స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయని, ఎన్నికల ఫలితాల రోజు (జూన్‌ 4న) భారీగా నష్టపోయాయని రాహుల్‌గాంధీ అన్నారు. దీనివల్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు సుమారు రూ.30 లక్షల కోట్లు కోల్పోయారన్నారు. ఇదో పెద్ద స్కామ్‌గా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్టాక్‌ మార్కెట్ల గురించి మాట్లాడారని గుర్తు చేశారు. జూన్‌ 4న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయంటూ అసలు మోదీ, అమిత్‌ షా మదుపర్లకు పెట్టుబడి సలహాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పని వారికి ముందే తెలుసని వ్యాఖ్యానించారు. 

యాపిల్‌ను దాటేసిన ఎన్విడియా.. రెండో అత్యంత విలువైన కంపెనీగా అవతరణ

ఎగ్జిట్‌ పోల్స్‌ ముందురోజు భారీ స్థాయిలో లావాదేవీలు ఎలా జరిగాయంటూ లావాదేవీల పట్టికను విలేకరుల సమావేశంలో రాహుల్‌ ప్రదర్శించారు. ఆ రోజు లావాదేవీల్లో పాల్గొన్నదెవరు? అంతిమంగా లబ్ధి పొందిందెవరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీన్ని కొందరు విదేశీ మదుపరులు సద్వినియోగం చేసుకున్నారన్నారని వ్యాఖ్యానించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోగా.. కొందరు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రం లాభపడ్డారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మోదీ, షాకు ఈ కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు. వీరితో పాటు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు, విదేశీ వ్యక్తుల పాత్రనూ నిగ్గు తేల్చాలని, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.

ఓటమిని జీర్ణించుకోలేకే..: భాజపా

స్టాక్‌ మార్కెట్‌ గురించి రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ ఖండించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే రాహుల్‌ గాంధీ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపాలని ఓ వైపు మోదీ చూస్తుంటే.. మరోవైపు మదుపర్లను రాహుల్‌ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు