PM Modi: అరేబియా సముద్రంలో ప్రధాని డైవింగ్‌.. నీటి అడుగున పురాతన ద్వారకా వద్ద పూజలు

పురాతన ఆధ్యాత్మిక నగరం ద్వారకాను వీక్షించేందుకు ప్రధాని మోదీ స్కూబా డైవింగ్‌ చేశారు. సముద్ర గర్భాన నిక్షిప్తమైన ఆ మహా నగరాన్ని దర్శించుకొని పూజలు చేశారు. 

Updated : 25 Feb 2024 17:08 IST

ఇంటర్నెట్‌డెస్క్: కొన్ని నెలల వ్యవధిలోనే అరేబియా సముద్రంలో ప్రధాని మోదీ (PM Modi) మరోసారి డైవింగ్‌ చేశారు. ఆయన నేడు హిందువుల పురాతన ఆధ్యాత్మిక నగరమైన ద్వారకా వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఇందుకోసం ఆయన స్కూబా డైవింగ్‌ ద్వారా సముద్రజలాల్లోకి వెళ్లారు. ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఈ నగరాన్ని పరిపాలించినట్లు హిందువులు బలంగా విశ్వసిస్తారు. 

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ప్రారంభం..!

బెట్‌ ద్వారకా ద్వీపం వద్ద ప్రధాని మోదీ నేడు స్కూబా డైవింగ్‌ చేశారు. ఇందుకు అవసరమైన పరికరాలను ధరించారు. అనంతరం నీటిలోకి దిగి పురాతన నగరం అవశేషాల వద్దకు చేరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తన అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొన్నారు. ‘‘సముద్ర గర్భాన ఉన్న ద్వారకాలో పూజలు చేయడం ఓ దివ్యానుభవం. పురాతన యుగాల్లోని కాలాతీత భక్తికి అనుసంధానమైన అనుభూతిని పొందాను. శ్రీకృష్ణుడు అందరినీ అనుగ్రహిస్తారు’’ అని పోస్టులో పేర్కొన్నారు. దీనికి ఆ చిత్రాలను జతచేశారు. ప్రధాని కొన్ని నెలల క్రితం లక్షద్వీప్‌ వద్ద స్కూబా డైవింగ్‌ చేసిన విషయం తెలిసిందే. 

భారత్‌లోని సప్త మోక్షదాయక నగరాల్లో ద్వారక ఒకటిగా సంప్రదాయం చెబుతోంది. పశ్చిమ సముద్రతీరంలో సౌరాష్ట్ర(నేటి గుజరాత్‌)లో ద్వారకా పట్టణం ఉంది. దాన్ని ‘ద్వారావతి’ అనే పేరుతోనూ వ్యవహరించేవారు. అనేక ద్వారాలు ఉండటం వల్ల ఈ పేర్లు వచ్చాయని భావిస్తున్నారు. ద్వారకలో నందన, చైత్రరథ, మిశ్రక, వైబ్రాజ అనే నాలుగు ఉద్యానవనాలుండేవి. వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య దేశాల్లో ఇది ఒకటి. మహాభారతం సభా, శాంతి పర్వాల్లో ద్వారకను గురించి అనేక విషయాల ప్రస్తావన ఉంది. జరాసంధుడు అనే రాక్షసుడి దాడుల నుంచి రక్షణ పొందేందుకు సురక్షితమైన ప్రాంతం కావాలన్న శ్రీకృష్ణుడి కోరికపై విశ్వకర్మ ద్వారకను నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ సుందర నగరం అరేబియా సముద్రంలో మునగడంతో భక్తులెవరూ అక్కడికి వెళ్లలేకపోతున్నారు. ఈ ప్రాచీన నగరాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా గుజరాత్‌ ప్రభుత్వం జలాంతర్గామి సేవలను ప్రారంభించింది. ఇందుకోసం ముంబయికి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజ్‌గావ్‌ డాక్‌యార్డ్‌తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జలాంతర్గామికి 24మంది యాత్రికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. పర్యాటకులతో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు డైవర్లు, టెక్నీషియన్‌, గైడ్‌ కూడా ఉంటారు. ఇది భక్తులను అరేబియా సముద్రంలో 300 అడుగుల దిగువకు తీసుకెళ్తుంది.. అక్కడి నుంచి పురాతన నగర శిథిలాలతో పాటు అరుదైన సముద్ర జీవాలను చూడగలరు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని