PM Modi: వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?

PM Modi: బస్టాండ్‌లో పండ్లు విక్రయించుకుంటూ జీవనం గడిపే ఓ మహిళను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. ఇంతకీ ఎవరామె..?

Published : 29 Apr 2024 15:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తాజాగా ఓ వీధి వ్యాపారితో ముచ్చటించారు. కర్ణాటక (Karnataka)లోని సిరసి పర్యటనకు వెళ్లిన ప్రధాని.. అక్కడ స్థానికంగా పండ్లు విక్రయించుకునే మోహిని గౌడ (Mohini Gowda) అనే మహిళతో మాట్లాడారు. స్వచ్ఛభారత్‌ కోసం ఆమె చేస్తున్న పనిని కొనియాడారు.

ఎవరీ మెహిని గౌడ..

మోహిని స్వస్థలం ఉత్తర కన్నడ జిల్లా అంకోలాకు చెందిన హాలక్కి ప్రాంతం. అంకోలా బస్టాండ్‌లో ఆమె బుట్టలో పండ్లు విక్రయించుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అందరిలాగా కవర్లలో కాకుండా ఆకుల్లో పండ్లను అమ్ముతున్నారు. కొందరు ప్రయాణికులు పండ్లను కొని తిన్న తర్వాత ఆకులను అక్కడే పడేసి వెళ్లిపోవడం మోహిణి చాలాసార్లు గమనించారు. ఎవరికో చెప్పడం ఎందుకని భావించిన ఆమె ఆ వ్యర్థాలను తానే సేకరించి చెత్త బుట్టలో వేయడం మొదలుపెట్టారు. చెట్ల నుంచి రాలిన ఆకులనూ ఊడ్చి పడేస్తున్నారు.

ఈ పానీపూరీ మోదీ చాలా నీట్‌ గురూ

కొద్ది రోజుల క్రితం ఆదర్శ్‌ హెగ్డే అనే వ్యక్తి ఆమె చేస్తున్న పనిని చూసి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా కూడా ఆ వీడియోను రీపోస్ట్‌ చేస్తూ మోహినిని ప్రశంసించారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న నిశ్శబ్ద హీరోలు వీరేనంటూ కొనియాడారు.

ఎలాంటి స్వార్థం లేకుండా, ఏ ఫలితాన్నీ ఆశించకుండా ఆమె చేస్తున్న ఈ పని నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మోహిని గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ గురువారం సిరిసి పర్యటన సమయంలో ఆమెను హెలిప్యాడ్‌ వద్ద కలిశారు. స్వచ్ఛ భారత్‌ కోసం ఆమె చేస్తున్న కృషి నేటితరానికి స్ఫూర్తి దాయకం అని కొనియాడారు. ఈ వీడియోను ఆదర్శ్‌ హెగ్డే ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని