PM Modi: మీ ఐదేళ్ల లక్ష్యాలేమిటీ.. మంత్రిత్వశాఖలను అడిగిన ప్రధాని మోదీ..!

వచ్చే ఐదేళ్లలో ఆయా శాఖలు విధించుకొన్న లక్ష్యాలు ఏమిటో తెలియజేయాలని ప్రధాని కోరారు. ఈమేరకు ఆయన కార్యాలయం నుంచి ఓ పత్రం కీలక అధికారులు, మంత్రులకు వెళ్లినట్లు తెలుస్తోంది. 

Published : 20 Mar 2024 16:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రానున్న ఐదేళ్లలో ఏటా వారి శాఖల్లో సాధించాలనుకొన్న లక్ష్యాలు ఏమిటో తెలియజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కేంద్ర మంత్రులను కోరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ పత్రం ఒకటి ఆంగ్ల వార్తా సంస్థ చేతికి అందింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందు ప్రభుత్వంలోని కీలక అధికారులకు ప్రధాని సూచనలు చేస్తూ దీనిని పంపారు. 

భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగుణంగా రానున్న ఐదేళ్ల కార్యాచరణను తెలియజేయాలని అన్ని ప్రభుత్వ శాఖలను కోరుతూ మార్చి 11న ప్రధాని కార్యాలయం ఓ పత్రాన్ని పంపింది. వారిచ్చే సమాచారం ఆధారంగా కొత్త ప్రభుత్వం తదుపరి 100 రోజుల ప్రణాళిక ఉంటుందని అందులో పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ కల్పన, కార్మిక రంగంపై మరింత దృష్టిపెట్టాలని అందులో సూచించారు. ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై కొత్త ప్రభుత్వం ఏర్పడేలోపు కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్లాన్లు సిద్ధం చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందుకు అవసరమైన వివిధ పారిశ్రామిక వర్గాలను కూడా కలుసుకోవాలని సూచించారు. నూరుశాతం పిల్లలు పాఠశాలలకు వెళ్లడం, టీకాలు వేయించుకోవడం వంటి అంశాలను కూడా అందులో ప్రస్తావించారు. 

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ మనదే: ప్రధాని మోదీ

గత అక్టోబర్‌లో అధికారులకు వెళ్లిన పత్రంలో కూడా పలు అంశాలను ప్రస్తావించారు. గ్రామీణప్రాంతాల్లో ఆర్థిక వృద్ధి కోసం కోల్డ్‌ చైన్‌ లాజిస్టిక్‌ వ్యవస్థలు, ఆర్గానిక్‌ వ్యవసాయానికి అవసరమైన వసతుల కల్పన, 2030 నాటికి సమష్టి వ్యవసాయం పెంచడంపై ప్రణాళికలు సిద్ధం చేసిందని సదరు ఆంగ్లవార్తా సంస్థ పేర్కొంది. వ్యవసాయోత్పత్తిని పెంచడం, వ్యవసాయేతర రంగాల్లోకి ఉద్యోగాలను మళ్లించడం వంటి అంశాలు దీనిలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని