PM Modi: గగనతలంలో ‘సూర్యతిలకం’ వీక్షించి.. మోదీ భావోద్వేగం

PM Modi: అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యతిలకం తనకు ఎంతో భావోద్వేగ క్షణం అని ప్రధాని మోదీ అన్నారు.

Published : 17 Apr 2024 14:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం కన్పించింది. బాలరాముడి నుదిటిపై సూర్య భగవానుడు దిద్దిన తిలకం చూసి భక్తకోటి పులకించిపోయింది. ప్రత్యక్ష ప్రసారంలో ఆ అపూర్వ దృశ్యాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీక్షించారు. ఆ చిత్రాలను సోషల్‌ మీడియాలో పంచుకున్న ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు.

అయోధ్య బాలరాముడికి ‘సూర్యతిలకం’.. కనువిందు చేసిన అద్భుత దృశ్యం

‘‘నల్‌బడీ (అస్సాం) ర్యాలీ తర్వాత రామ్‌లల్లా నుదిటిపై సూర్యతిలకాన్ని చూసి తరించాను. కోట్లాది మంది భారతీయుల్లానే నాక్కూడా ఇది ఎంతో భావోద్వేగభరిత క్షణం. అయోధ్య చరిత్రలోనే అత్యంత ఘనమైన రామనవమి ఉత్సవమిది. ఈ సూర్యతిలకం వికసిత భారతం తీసుకునే ప్రతీ సంకల్పాన్ని తన దివ్య శక్తితో మరింత ప్రకాశవంతం చేస్తుందని ఆశిస్తున్నా. ఇది మన జీవితాలకు కొత్త శక్తిని తీసుకురావాలని, కీర్తిపతాకలో మన దేశం కొత్త శిఖరాలను చేరుకునేలా నూతన స్ఫూర్తిని అందించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ప్రధాని రాసుకొచ్చారు.

ర్యాలీ అనంతరం గగనతలంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ మోదీ ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం అస్సాంలో పర్యటించిన పర్యటించిన మోదీ.. నల్‌బడీ సభలోనూ దీని గురించి ప్రస్తావించారు. ‘‘500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు సొంతింటికి చేరుకున్నాడు. దివ్య భవ్య మందిరంలో తన పుట్టినరోజును చేసుకున్నాడు. ఆ రాముడి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి’’ అని ప్రధాని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని