పశుపతి పరాస్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం.. కిరణ్‌ రిజిజుకు అదనపు బాధ్యతలు

బిహార్‌లో ఎన్డీయే కూటమి సీట్ల పంపకాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి పదవికి పశుపతి పరాస్‌ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.

Published : 20 Mar 2024 12:51 IST

దిల్లీ: బిహార్‌ (Bihar)లో సీట్ల పంపకాల్లో తమ పార్టీకి భాజపా అన్యాయం చేసిందని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ (RLJP) అధ్యక్షుడు పశుపతి కుమార్‌ పరాస్‌ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతిముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజుకు  పరాస్‌ నిర్వహించిన మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్‌ విడుదల

బిహార్‌లో పొత్తులో భాగంగా చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ (రాంవిలాస్‌) పార్టీకి ఎన్డీయే ఐదు సీట్లు కేటాయించింది. దీనిపై పశుపతి పరాస్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ప్రధాని మోదీ గొప్ప నేత. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. కానీ, బిహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో మాకు అన్యాయం జరిగింది. మా పార్టీకి ఐదుగురు ఎంపీలు ఉన్నా.. పొత్తులో మాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన్ను బిహార్‌లోని ప్రతిపక్ష కూటమికి ఆర్జేడీ ఆహ్వానించింది. ‘ఒకవేళ  పశుపతి పరాస్‌ బిహార్‌ ప్రతిపక్ష కూటమిలోకి రావాలనుకుంటే.. మేము స్వాగతం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధమే.’ అని ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ అన్నారు.

మరోవైపు రాష్ట్రంలో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికంగా భాజపా 17 స్థానాల్లో పోటీ చేయనుంది. సీఎం నీతీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ 16 సీట్లలో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. మిగిలిన రెండు ఎన్డీయే భాగస్వామి పార్టీలైన హిందుస్థానీ అవామ్‌ మోర్చా, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌ మంచ్‌ పార్టీ చెరో ఒక్కో స్థానాల్లో పోటీ చేస్తాయని భాజపా బిహార్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి వినోద్‌ తాడ్వే వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని