PM Modi: జనవరి 22 కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది: అయోధ్య ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో మోదీ

PM Modi: PM Modi: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22.. చరిత్రలో విశిష్ఠమైన రోజుగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఆ రోజున ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని దేశ ప్రజలను కోరారు.

Updated : 30 Dec 2023 15:41 IST

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అయోధ్య (Ayodhya)లో మరికొద్ది రోజుల్లో రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఆ మహత్కార్యం కోసం యావత్‌ ప్రపంచం ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. శనివారం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని.. ఈ ఆధ్యాత్మిక నగరంలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘అయోధ్య విమానాశ్రయానికి.. త్రికాలదర్శి అయిన మహర్షి వాల్మీకి పేరు పెట్టడం జన్మధన్యంగా భావిస్తున్నా. రోజుకు 10 లక్షల మందికి సేవలు అందించేలా ఈ ఎయిర్‌పోర్టును నిర్మించాం. రద్దీ మేరకు రహదారులు విస్తరిస్తాం. అయోధ్యధామ్‌లో ఎక్కడ చూసినా రామనామం వినిపించాలి. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని వసతులతో టౌన్‌షిప్‌లు నిర్మిస్తున్నాం’’ అని వెల్లడించారు.

రామాలయ స్ఫూర్తి.. రికార్డు సమయంలో పూర్తి..! అయోధ్య విమానాశ్రయ విశేషాలివే..

ఆ రాత్రి దీపాలు వెలిగిద్దాం..

అనంతరం వచ్చే నెల జరగబోయే రామమందిర ప్రారంభోత్సవంపై ప్రధాని మాట్లాడారు. ‘‘2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. హిందుస్థాన్‌ చరిత్రలో జనవరి 22 విశిష్ఠమైన రోజుగా నిలుస్తుంది. ఆ రాత్రి దేశంలోని ప్రతి ఇంటా రామ జ్యోతి వెలిగించాలి. ఒకప్పుడు రామ్‌ లల్లా టెంట్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆయనకు పక్కా ఇంటిని అత్యంత సుందరంగా నిర్మించాం. ఆయనతో పాటు దేశంలో 4 కోట్ల మందికి మేం పక్కా గృహాలు కట్టించాం’’ అని మోదీ తెలిపారు.

జనవరి 23 నుంచి రండి..

ఈ సందర్భంగా భక్తులకు ప్రధాని కీలక సూచన చేశారు. ‘‘జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించాలని అందరూ కోరుకుంటారు. కానీ, అది అందరికీ సాధ్యపడదని మీకు తెలుసు. అందుకే, రద్దీ దృష్ట్యా జనవరి 22న భక్తులు అయోధ్యకు రావొద్దు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 23 నుంచి జీవితాంతం శ్రీరాముడిని దర్శించుకోవచ్చు’’ అని మోదీ సూచించారు. భక్తులు ఇబ్బంది పడకూడదనే ఈ సూచన చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ఉదయం అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ తొలుత 15 కిలోమీటర్ల మేర మెగా రోడ్‌ షోలో పాల్గొన్నారు. అనంతరం ఆధునిక హంగులతో అభివృద్ధి చేసిన అయోధ్య ధామ్‌ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. రెండు అమృత్‌ భారత్‌, ఆరు వందే భారత్‌ రైళ్లకు పచ్చ జెండా ఊపారు. అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. మహర్షి వాల్మీకి ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. దీంతో పాటు రూ.15,700కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని