Ayodhya: ‘రామ మందిర’ ప్రారంభోత్సవం.. అయోధ్యకు 1000 రైళ్లు..!

Ayodhya Ram Mandir: రామ మందిర ప్రారంభాన్ని పురస్కరించుకుని అయోధ్యకు వెయ్యికి పైగా రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి ఈ రైళ్లను నడపనున్నట్లు తెలుస్తోంది.

Updated : 11 Jan 2024 13:55 IST

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pardesh)లోని అయోధ్య (Ayodhya)లో నిర్మిస్తోన్న రామ మందిర (Ram Mandir) ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న పవిత్ర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనవరి 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శనం కల్పించనున్నారు. దీంతో దేశ విదేశాల నుంచి భక్తులు అయోధ్యకు పోటెత్తే అవకాశం ఉండటంతో రైల్వే శాఖ (Indian Raiway) కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రారంభం నాటి నుంచి తొలి వంద రోజుల పాటు అయోధ్యకు 1000కి పైగా రైళ్ల (Trains)ను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ వర్గాలు ప్రకటించాయి.

మందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజుల ముందే అంటే.. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఈ రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. వంద రోజుల పాటు దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కతా, నాగ్‌పుర్‌, లఖ్‌నవూ, జమ్మూ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి అయోధ్యకు రైళ్లు నడపనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఈ సంఖ్య మరింత పెరగొచ్చని తెలుస్తోంది.

దీంతోపాటు, కొన్ని రైళ్లను ప్రత్యేకంగా భక్తుల కోసం రిజర్వ్‌ చేసి ఛార్టెర్డ్‌ సర్వీసులు అందించనున్నట్లు సదరు వర్గాల సమాచారం. ఇక, ఈ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఆహారం అందించేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అయోధ్యలోని రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. రోజుకు 50వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి అయోధ్య స్టేషన్‌ పనులు పూర్తి కానున్నాయి.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. 2024 జనవరి 22న గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్‌ లల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి, 10 రోజుల పాటు 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు నాలుగు వేల మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని