Obama Remark Row: భారత్‌లో మతస్వేచ్ఛపై ఒబామా వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన కేంద్రమంత్రులు

Obama Remark Row: భారత్‌లో మత స్వేచ్ఛపై బరాక్‌ ఒబామా చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం అవుతోంది. ఆయన వ్యాఖ్యలకు కేంద్రమంత్రులు దీటుగా బదులిస్తున్నారు. 

Published : 26 Jun 2023 23:56 IST

 

దిల్లీ: భారత్‌లో మైనార్టీల హక్కులపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా(US former President Barack Obama) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోదీ(PM Modi) అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఒబామా స్పందన రాగా.. కేంద్రమంత్రులు వాటిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే నిర్మలా సీతారామన్ ఆయన మాటలను తోసిపుచ్చగా.. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్(Rajnath Singh) స్పందించారు. (Obama Remark Row)

‘నేను ప్రధాని మోదీ(PM Modi)తో మాట్లాడితే.. భారత్‌లోని మైనార్టీల హక్కుల గురించి ప్రస్తావిస్తాను. వారి హక్కులను పరిరక్షించలేకపోతే.. భారత్‌ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది’ అని ఒబామా వ్యాఖ్యానించారు. దీనిపై రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ..‘ప్రపంచవ్యాప్తంగా నివసిస్తోన్న ప్రజలందరినీ భారత్‌ ఒక కుటుంబంలా భావిస్తుందని ఒబామాజీ మర్చిపోకూడదు. ఆయన హయాంలో ఎన్ని ముస్లిం దేశాలపై దాడులు జరిగాయనే దాని గురించి ఆలోచించుకోవాలి’ అని రాజనాథ్‌ ఘాటుగా స్పందించారు. ‘ప్రస్తుతం భారత్‌లో అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు 1984 నాటి అల్లర్లు చోటుచేసుకోవడం లేదు’ అని మరో నేత ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. 

నిన్న ఇదే విషయంపై నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman ) మాట్లాడుతూ.. ‘ఒబామా వ్యాఖ్యలపై మాట్లాడేందుకు నేను చాలా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇది రెండు దేశాలతో ముడిపడి ఉన్న అంశం. మేం అమెరికాతో స్నేహం కోరుకుంటున్నాం. కానీ, అక్కడ కూడా భారత్‌లో మతస్వేచ్ఛ, మైనార్టీల హక్కుల గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో ఆరు ముస్లిం దేశాలపై బాంబులతో విరుచుకుపడలేదా? 26,000 బాంబులను ప్రయోగించినట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాంటి వ్యక్తి మాటలను ఎవరైనా విశ్వసిస్తారా?’అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇక, యూఎస్‌ కమిషన్ ఆన్‌ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం(USCIRF) మాజీ కమిషనర్ జానీ మూరే కూడా ఒబామా వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘భారత్‌ను విమర్శించడం మీద కాకుండా, మెచ్చుకోవడం మీద ఒబామా తన ఎనర్జీని ఉపయోగించుకోవాలని భావిస్తున్నా. మానవ చరిత్రలో భారత్‌ అత్యంత భిన్నత్వం కలిగిన దేశం. అమెరికా వలే అది కూడా పర్‌ఫెక్ట్‌ కాదు. దాని భిన్నత్వమే దాని బలం’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని