Ratan Tata: రిస్క్‌లేని పెట్టుబడి అంటూ.. రతన్‌ టాటా నకిలీ ఇంటర్వ్యూ ఇన్‌స్టాలో పోస్టు

రతన్‌ టాటా మాట్లాడినట్లు ఓ నకిలీ ఇంటర్వ్యూ ఇన్‌స్టాగ్రామ్‌లో వెలుగుచూసింది. 

Updated : 07 Dec 2023 05:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి రష్మిక(Rashmika) డీప్‌ఫేక్‌(Deepfake) వీడియో వ్యవహరం ఇటీవల పెనుచర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం సైతం పలువురి నటీమణుల వీడియోలు సైతం మార్ఫింగ్‌కి గురయ్యాయి. రోజురోజుకు టెక్నాలజీ దుర్వినియోగం అవుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ రతన్‌టాటా(Ratan Tata)కు సంబంధించిన ఓ ఫేక్‌ వీడియో(Fake Video) సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. పెట్టుబడికి సంబంధించి రతన్‌ టాటా మాట్లాడినట్లు వీడియో రూపొందించి పోస్టు చేశారు.  

సోనా అగర్వాల్‌ అనే వ్యక్తి రతన్‌టాటాను ఇంటర్వ్యూ చేసినట్లు నకిలీ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలో సోనా అగర్వాల్‌ను తన మేనేజర్‌గా రతన్‌ టాటా పరిచయం చేశారు. ‘‘భారత ప్రజలకు ఇదే నా సిఫార్సు. మీరు ఎలాంటి రిస్క్‌ లేకుండా, వంద శాతం గ్యారెంటీతో పెట్టుబడులు పెట్టడానికి ఇదో అవకాశం. దీనికోసం వెంటనే ఈ ఛానెల్‌కు వెళ్లండి’’ అని ఆ వీడియోలో ఉంది. అంతేకాకుండా కొందరు వ్యక్తులు పెట్టుబడి పెట్టి డబ్బులు తీసుకుంటున్నట్లు కూడా వీడియోలో చూపించాడు. అయితే అదంతా అవాస్తమంటూ రతన్‌ టాటా సోషల్‌మీడియా వేదికగా స్పష్టం చేశారు.

డీప్‌ఫేక్‌ తీవ్ర ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం దీనిపై సీరియస్‌గా ఆలోచిస్తోంది. తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సమీక్ష నిర్వహించింది. కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సామాజిక మాధ్యమాల ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. డీప్‌ఫేక్‌లను నిలువరించడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని