Terrorist Attack: జమ్మూ ఉగ్రదాడి.. చనిపోయినట్లు నటించి.. ప్రాణాలు కాపాడుకొని!

యాత్రికులే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్‌లో పర్యాటక బస్సుపై దాడికి పాల్పడింది తామేనంటూ పాకిస్థాన్‌ లష్కరే తొయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌) ప్రకటించుకుంది.

Published : 10 Jun 2024 14:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాత్రికులే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్‌లో పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. అయితే, ఈ దారుణానికి పాల్పడింది తామేనంటూ పాకిస్థాన్‌ లష్కరే తొయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌) ప్రకటించుకుంది. అంతేకాకుండా ఇటువంటి మరిన్ని దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. ప్రధానమంత్రిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేసే రోజే ఈ దాడి జరగడం గమనార్హం.

శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తోన్న బస్సుపై ఉగ్రవాదులు ఆదివారం మెరుపుదాడి చేశారు. డ్రైవర్‌కు బుల్లెట్‌ తాకడంతో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా.. 33 మంది గాయపడ్డారు. డ్రైవర్‌తో సహా కండక్టర్‌ కూడా మరణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రాణాలతో బయటపడిన బాధితులు ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకున్నారు.

ఎన్నికల్లో ఓడినా.. పార్లమెంట్ సభ్యుడు కాకపోయినా.. కేంద్రమంత్రిగా

‘‘ముఖాలకు మాస్కులు పెట్టుకొని ఉన్న ఆరు లేదా ఏడుగురు ఉగ్రవాదులు బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. తొలుత అన్ని వైపులా కాల్పులు జరిపిన ముష్కరులు.. బస్సు లోయలో పడగానే అటుగా వచ్చి మళ్లీ కాల్పులు కొనసాగించారు. ఆ సమయంలో తాము చనిపోయినట్లు నమ్మించేందుకు మౌనంగా ఉండిపోయాం. ఎలాగైనా ఇంటికి తిరిగి వెళ్లడమే ముఖ్యమని అనుకున్నాం. ఓ పది, పదిహేను నిమిషాల తర్వాత స్థానికులు, పోలీసులు వచ్చి మమ్మల్ని కాపాడారు’ అని ప్రాణాలతో బయటపడిన పలువురు బాధితులు మీడియాకు వెల్లడించారు.

రంగంలోని ఎన్‌ఐఏ..

పాకిస్థాన్‌ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు పేర్కొన్న నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ.. స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు మొదలుపెట్టినట్లు సమాచారం. మరోవైపు హంతకుల వేట కోసం ఆర్మీ, సీఆర్పీఎఫ్‌, స్థానిక పోలీసులు కలిసి కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. డ్రోన్లతోనూ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. రియాసీ, ఉధంపుర్‌, ఫూంచ్‌, రాజౌరీ ప్రాంతాల్లోనే ఈ ఉగ్రమూకలు తలదాచుకున్నట్లు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు