CAA: సీఏఏకు వ్యతిరేకంగా పిటిషన్లు.. విచారించేందుకు సుప్రీం ఓకే

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ జరపనుంది. 

Updated : 15 Mar 2024 13:30 IST

దిల్లీ: కొత్తగా నోటిఫై చేసిన పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లు విచారించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. మార్చి 19న విచారణ ఉంటుందని వెల్లడించింది. ఆ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వచ్చే వరకూ దాని అమలును నిలిపివేయాలని కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(IUML) పార్టీ ఇటీవల అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై కొన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితమైందంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌(IUML) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని అమలును నిలిపివేయాలని తన పిటిషన్‌లో పేర్కొంది. అలాగే అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది. ‘మంగళవారం దీనిపై వాదనలు వింటాం. మొత్తం 190కి పైగా కేసులు ఉన్నాయి. అన్నింటినీ విచారిస్తాం’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ల తరఫు న్యాయవాదులకు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని