LS Polls: కేంద్ర మంత్రికి కృతజ్ఞతతో..! నామినేషన్‌ రుసుం చెల్లించిన విద్యార్థులు

కేరళలోని అత్తింగళ్‌ నుంచి బరిలో దిగిన భాజపా అభ్యర్థి, విదేశాంగ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ నామినేషన్‌ డిపాజిట్‌ సొమ్ము చెల్లించేందుకు విద్యార్థులు ముందుకు రావడం విశేషం.

Published : 30 Mar 2024 00:09 IST

తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు కేరళ సన్నద్ధమవుతోంది. మొత్తం 20 స్థానాలకు రెండో దశలో భాగంగా ఏప్రిల్‌ 26న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అత్తింగళ్‌ నియోజకవర్గం నుంచి భాజపా (BJP) అభ్యర్థిగా విదేశాంగ సహాయమంత్రి వి.మురళీధరన్‌ (V Muraleedharan) బరిలో దిగారు. ఆయన నామినేషన్‌ డిపాజిట్‌ సొమ్ము చెల్లించేందుకు విద్యార్థులు ముందుకు రావడం విశేషం. ఉక్రెయిన్‌ సంక్షోభం (Ukraine Crisis) సమయంలో కేంద్రం సాయంతో వీరంతా సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు.

తిరువనంతపురంలోని భాజపా కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈమేరకు ఎన్నికల డిపాజిట్‌ మొత్తాన్ని అందజేశారు. ‘‘యుద్ధం మొదలైనప్పుడు.. నేను ఉక్రెయిన్‌లోని జపోరిజియా యూనివర్సిటీ విద్యార్థిని. ఆ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి మురళీధరన్‌ల చొరవతో యుద్ధక్షేత్రం నుంచి బయటపడ్డాను. నాలాగే చాలామంది కేరళ విద్యార్థులను తీసుకొచ్చారు. దీనికి కృతజ్ఞతగా మేమంతా డబ్బు సేకరించి.. ఎన్నికల డిపాజిట్‌గా చెల్లించేలా కేంద్ర మంత్రికి అందజేశాం. మా తల్లిదండ్రులూ దీనికి సహకరించారు’’ అని ఓ విద్యార్థిని వివరించారు.

లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్‌ కేసులు: ఏడీఆర్‌

విద్యార్థులు చూపిన కృతజ్ఞతాభావం తనను కదిలించిందని మురళీధరన్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. వారి వద్ద నుంచి నామినేషన్‌ డిపాజిట్‌ పొందడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీపై కేరళ యువతకు ఉన్న అపారమైన నమ్మకాన్ని ఇది సూచిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా.. 2022 ఫిబ్రవరిలో సైనిక చర్య పేరిట రష్యా ప్రారంభించిన భీకర దాడులతో ఉక్రెయిన్‌ అతలాకుతలమైన విషయం తెలిసిందే. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ‘ఆపరేషన్‌ గంగ’ చేపట్టి దాదాపు 25వేల మందిని భారత్‌కు తరలించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని