Sudha Murty: యువ జంటలకు సుధామూర్తి సలహా ఇదే..!

Sudha Murty: కొత్తగా పెళ్లయిన దంపతులకు చాలా ముఖ్యమైన సలహా ఇచ్చారు ప్రముఖ విద్యావేత్త సుధామూర్తి. భర్తలు కిచెన్‌లో భార్యలకు సాయం చేయాలని అన్నారు.

Updated : 15 Mar 2024 17:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కలహాలు లేని కాపురం ఉండనే ఉండదంటున్నారు ప్రముఖ విద్యావేత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి (Sudha Murty). అయితే, అది గాలివానగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తలిద్దరిపైనా ఉంటుందని అన్నారు. ‘ఇండియా టుడే’ నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ‘ఆధునిక ప్రేమ’ అనే అంశంపై మాట్లాడుతూ యువ జంటల (Young Couple)కు సుధామూర్తి కొన్ని సలహాలు, సూచనలిచ్చారు.

‘‘దాంపత్య జీవితంలో గొడవలు సహజమే. దాన్ని మీరు అంగీకరించాలి. అసలు ఎప్పుడూ వాదులాట లేకపోతే వాళ్లు భార్యాభర్తలే కాదు. కానీ, గొడవ జరిగినప్పుడు ఒకరు కోపంగా ఉంటే రెండో వ్యక్తి శాంతించాలి. మాట్లాడకూడదు. (నారాయణ) మూర్తికి కోపం వస్తే నేను అస్సలు మాట్లాడను. ఆయనా అలాగే ఉంటారు. అంతేగానీ, ఇద్దరూ అరుచుకుంటే మరిన్ని గొడవలకు దారితీస్తుంది’’ అని ఆమె తెలిపారు.

‘‘జీవితమంటేనే కష్టనష్టాల ప్రయాణం. ఇందులో ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదు. భార్యాభర్తలిద్దరిలోనూ ప్లస్‌లు, మైనస్‌లు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని ముందుకుసాగాలి. ఈతరం అబ్బాయిలకు నేను చెప్పేది ఒకటే.. వంటగదిలో మీ భార్యకు సాయం చేయండి. అది చాలా ముఖ్యం. మీ జీవితభాగస్వామి బాధ్యతలను పంచుకోండి. కష్టాలను ఒకరికొకరు పంచుకోండి’’ అని ఆమె యువ దంపతులకు సలహాలిచ్చారు.

రచయిత్రిగా, విద్యావేత్తగా, వితరణశీలిగా పేరొందిన సుధామూర్తి ప్రస్తుతం ‘మూర్తి ట్రస్ట్‌’కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. సేవారంగంలో చేసిన కృషికి గానూ ఇటీవలే రాష్ట్రపతి ఆమెను రాజ్యసభకు నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. పెద్దల సభ సభ్యురాలిగా గురువారం ఆమె ప్రమాణస్వీకారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని