Angelina Jolie: అఫ్గాన్ కల్లోలం.. ఇన్‌స్టాగ్రాంలో చేరిన ఏంజెలినా జోలీ

ప్రముఖ అమెరికన్ నటి ఏంజెలినా జోలీ అఫ్గానిస్థాన్ కల్లోలంపై తన గళం విప్పారు. సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రాం ఖాతాను తెరిచి మహిళలు, చిన్నారులకు తన మద్దతును ప్రకటించారు. వారి విదారక పరిస్థితుల్ని ప్రపంచానికి చాటేందుకు ఆ ఖాతాను అంకింతం చేశారు. ఓ అఫ్గాన్ బాలిక తమ వెతలను వెళ్లగక్కుతూ రాసిన లేఖను ఇన్‌స్టా వేదికలో పంచుకున్నారు. 

Updated : 21 Aug 2021 15:10 IST

అఫ్గాన్‌ ప్రజల వెతలు ప్రపంచానికి చాటేందుకే..

వాషింగ్టన్: ప్రముఖ అమెరికన్ నటి ఏంజెలినా జోలీ అఫ్గానిస్థాన్ కల్లోలంపై తన గళం విప్పారు. సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రాం ఖాతాను తెరిచి మహిళలు, చిన్నారులకు తన మద్దతును ప్రకటించారు. వారి పరిస్థితుల్ని ప్రపంచానికి చాటేందుకు ఆ ఖాతాను అంకింతం చేశారు. ఓ అఫ్గాన్ బాలిక తమ వెతలను వెళ్లగక్కుతూ రాసిన లేఖను ఇన్‌స్టా వేదికలో పంచుకున్నారు. 

‘ప్రస్తుతం అఫ్గాన్‌వాసులు సామాజిక మాధ్యమాల వేదికగా తమను తాము స్వేచ్ఛగా వ్యక్తీకరించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. వారి బాధలు, ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాడుతున్న వారి గళాన్ని వినిపించడానికి ఇన్‌స్ట్రాగాంలో చేరాను. మళ్లీ భయం, అనిశ్చితి గుప్పిట్లోకి వెళ్లిన అఫ్గాన్లను చూస్తుంటే చాలా బాధగా ఉంది. వారిని భారంగా భావించడం ఆవేదనకు గురిచేస్తోంది. ఇతరుల వలే నేను మాటిచ్చి వెనక్కి రాను. సహాయం చేయడానికి కావాల్సిన మార్గాల కోసం వెతుకుతూనే ఉంటాను. మీరు నాతో చేరతారని ఆశిస్తున్నాను’ అంటూ ఏంజెలినా ఓ బాలిక రాసిన లేఖను షేర్ చేశారు. అయితే ఆ అమ్మాయి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. 

ఏంజెలినా పంచుకున్న లేఖలో ఆ బాలిక తన భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘20 సంవత్సరాలు గడిచాయి. మళ్లీ ఇప్పుడు మాకు ఎలాంటి హక్కులు లేవు. మాకు అంతా చీకటిగా ఉంది. మా స్వేచ్ఛను కోల్పోయాం. మళ్లీ మేం బందీలుగా మారిపోయాం’ అని ఆవేదన చెందింది. తన చదువును కొనసాగించడం ఎలా వీలవుతుందంటూ వాపోయింది. ఇదిలా ఉండగా..ఏంజెలినా జోలీ మొదటి నుంచి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆమె పిల్లలు కూడా వాటికి దూరంగానే ఉన్నట్లు ఒకానొక సందర్భంలో ఆమె వెల్లడించారు. అలాగే శుక్రవారం ఆమె ఇన్‌స్టా ఖాతాను తెరవగా 4.6 మిలియన్ల మంది ఆమెను అనుసరిస్తున్నారు. అలాగే ఆమె పెట్టిన పోస్టు విపరీతంగా వైరల్‌ అయింది. 

2001లో అఫ్గానిస్థాన్‌లో అడుగుపెట్టిన అమెరికా సైన్యం ఇటీవల ఆ దేశం నుంచి వైదొలిగింది. తమకు అడ్డుతొలగిపోవడంతో తాలిబన్లు మెరుపువేగంతో ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. గతంలో వారి పాలనలో మహిళలను ఆంక్షల్లో బందీగా చేసి, అరాచకాన్ని సృష్టించారు. ఇప్పుడు మొదట శాంతవచనాలు పలికినప్పటికీ.. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. వారి రాకతో ప్రజలు వణికిపోతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేక్రమంలో వెలుగులోకివస్తోన్న ఎన్నో అమానవీయ ఘటనలు ప్రపంచాన్ని మెలిపెడుతున్నాయి..! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని