Israel: హమాస్‌ను ఉగ్రసంస్థగా భారత్‌ గుర్తించాలి.. ఆ సమయం ఆసన్నమైందన్న ఇజ్రాయెల్‌

Israel Hamas Conflict: హమాస్‌ దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ సమయంలో భారతదేశం హమాస్‌ వ్యతిరేక వైఖరిని తీసుకోవాలని ఇజ్రాయెల్‌ ఆశిస్తోంది.

Updated : 26 Oct 2023 12:52 IST

దిల్లీ: హమాస్‌(Israel Hamas)తో పోరువేళ.. తమ కార్యకలాపాలకు భారత్(India) అందిస్తోన్న మద్దతుపై ఇజ్రాయెల్‌ హర్షం వ్యక్తం చేసింది. అదే సమయంలో భారత్‌ కూడా హమాస్‌పై కఠిన వైఖరి అనుసరించాలని కోరుకుంటోంది. ఇతర దేశాల మాదిరిగానే భారత్‌ కూడా హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు మనదేశంలోని ఇజ్రాయెల్‌ రాయబారి నవోర్‌ గిలాన్‌(Israeli ambassador Naor Gilon) కీలక వ్యాఖ్యలు చేశారు. (Israel Hamas Conflict)

‘ముఖ్యమైన దేశాలు మనతోనే ఉన్నాయి. అవి ప్రజాస్వామ్యాలు. ఇక భారతదేశం హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను’ అని మీడియాతో మాట్లాడుతూ గిలన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే అమెరికా, కెనడా, ఐరోపా సమాఖ్య వంటివి హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాయని చెప్పారు. దీనికి సంబంధించి తాము ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడామన్నారు.

అమెరికాలో కాల్పుల మోత.. 22 మంది మృతి.. నరహంతకుడి కోసం వేట..!

‘హమాస్ దాడి తర్వాత దాని గురించి ఇక్కడి అధికారులతో మేం మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికీ సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ చర్చ స్నేహపూర్వకంగా ఉంది. నా అంచనా ప్రకారం.. మన రెండు దేశాలు ఉగ్రముప్పును అర్థం చేసుకున్నాయి. అయినా, ఇది ఒకరు ఒత్తిడి తెచ్చే అంశం కాదు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, ఇతర వ్యూహత్మక విషయాల్లో మేం ఒకే రకమైన అభిప్రాయాలతో ఉన్నాం’ అని అన్నారు.

అక్టోబర్‌ 7న తమ దేశంలోకి చొరబడి మారణహోమం సృష్టించిన హమాస్‌ను తుడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం భీకర పోరు కొనసాగిస్తోంది. ఈ సమయంలో కొద్దిరోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యూహు(Israeli PM Benjamin Netanyahu).. ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆ సందర్భంగా ఇజ్రాయెల్‌కు అన్నివిధాల అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు. ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌-పాలస్తీనా విషయంలో తమ వైఖరి చాలా కాలంగా స్థిరంగా ఉందని భారత్‌ ఇటీవల స్పష్టం చేసింది.

పాలస్తీనా(Palestine) స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందడాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌, గాజాలో మానవతా పరిస్థితులపై స్పందిస్తూ.. ఇరు వర్గాలు అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటించాలని కోరింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని