Arvind Kejriwal:: కేజ్రీవాల్‌ అరెస్టుపై స్పందించిన అమెరికా

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన అరెస్టు వేళ.. అమెరికా స్పందించింది. 

Updated : 26 Mar 2024 16:36 IST

దిల్లీ: మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఈడీ (ED) అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. దీనిపై తాజాగా అమెరికా నుంచి స్పందన వచ్చింది. భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని పేర్కొంది.

కేజ్రీవాల్‌ అరెస్టుపై ఈ-మెయిల్‌లో అడిగిన ఓ ప్రశ్నకు యూఎస్ అధికార ప్రతినిధి బదులిస్తూ.. ‘‘సమయానుకూల, పారదర్శక న్యాయప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై ఇటీవల జర్మనీ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.  ‘‘భారత్‌ ప్రజాస్వామ్య దేశం. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులు. అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్‌ రెండో ఆదేశాలు..

జర్మనీ స్పందనపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దిల్లీలోని ఆ దేశ రాయబారికి సమన్లు పంపింది. దాంతో జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్‌ జార్జ్‌ ఎంజ్‌వీలర్‌ కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఆయన వద్ద భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటని మండిపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు