LS Polls: చైనా ప్రాంతాల పేర్లను భారత్‌ మారిస్తే..? డ్రాగన్‌కు రాజ్‌నాథ్‌ హెచ్చరిక

ఒకవేళ చైనాలోని వివిధ ప్రాంతాల పేర్లను భారత్‌ మారిస్తే అవి మా భూభాగం కిందికి వచ్చేస్తాయా? అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశ్నించారు.

Published : 09 Apr 2024 18:38 IST

ఇటానగర్: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చైనా (China) కొత్త పేర్లు పెట్టడాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) మరోసారి ఖండించారు. ఒకవేళ భారత్‌ కూడా చైనా విషయంలో ఇదే పని చేస్తే.. అక్కడున్న భూభాగాలు మనవి అయిపోతాయా? అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో అరుణాచల్‌లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌.. ఈ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగమని ఉద్ఘాటించారు. చైనా ఎత్తుగడతో వాస్తవాలు మారవని స్పష్టంచేశారు.

‘‘ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఒకవేళ మేం పొరుగు దేశం (చైనా)లోని వివిధ ప్రాంతాల పేర్లను మార్చినట్లయితే.. అవి మా భూభాగం కిందికి వచ్చేస్తాయా? చైనా ఇటువంటి తప్పులు చేయొద్దు. ఈ తరహా దుందుడుకు చర్యల వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయి’’ అని రాజ్‌నాథ్‌ హెచ్చరించారు. ‘‘మేం పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నాం. కానీ, ఎవరైనా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తే మాత్రం.. దీటైన సమాధానం ఇవ్వగల సామర్థ్యం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కోసం భాజపా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని చెప్పారు.

మోదీ హయాంలో.. ఒక్క అంగుళాన్నీ చైనా ఆక్రమించలేదు: అమిత్‌ షా

ఇటీవల అరుణాచల్‌లోని 30 ప్రాంతాలకు చైనా అధికారికంగా పేర్లు పెట్టి, రెచ్చగొట్టేందుకు యత్నించింది. 2017లో తొలిసారిగా అరుణాచల్‌లోని 6 ప్రాంతాలకు ఇలా చైనీస్‌ పేర్లను పెట్టింది. రెండోసారి 2021లో 15 ప్రాంతాలకు పేర్లను విడుదల చేసింది. ఇదిలాఉంటే.. చైనా కుయుక్తులను భారత ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. ‘‘నేనొచ్చి మీ ఇంటి పేరు మారిస్తే.. ఆ ఇల్లు నాదవుతుందా..? అరుణాచల్‌ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. పేర్లు మార్చడం వంటి చర్యలతో ఎలాంటి ప్రభావం ఉండదు’’ని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని